ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సరికొత్త సంచలనం రేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన మాజీ రాజ్యసభ ఎంపీ వి. విజయసాయి రెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తిరుమల శ్రీవారి సాక్షిగా ఆయన చేసిన ఈ ప్రకటనతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే ఈ పరిణామం వెనుక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. విజయసాయి రెడ్డిని ఎలాగైనా శాంతింపజేసి, రాజీ కుదుర్చుకోవడానికి జగన్ తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. అసలు జగన్ ఎందుకు భయపడుతున్నారు? ఓట్లు ఎలా చీలిపోతాయి? సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ వ్యవహారంతో ఉన్న లింక్ ఏంటి..?
గతంలో వైసిపికి రాజీనామా చేసి, యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న విజయసాయి రెడ్డి.. త్వరలోనే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి తన కొత్త పార్టీ రోడ్‌మ్యాప్‌ను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ వార్త బయటకు రాగానే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో అలజడి మొదలైంది. ఒకవేళ విజయసాయి రెడ్డి పార్టీ పెడితే.. అది నేరుగా వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్‌కే భారీ గండి కొడుతుందని జగన్ భావిస్తున్నారు. పార్టీ వీడినా ఇప్పటికీ వైసిపి కేడర్‌లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లోని రెడ్డి సామాజిక వర్గ నేతలలో సాయిరెడ్డికి మంచి పట్టు ఉంది. ఆయన కొత్త జెండా ఎత్తితే.. వైసీపీ బలహీనపడటం ఖాయమనే భయం జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరి నచ్చక, ఆయన మితిమీరిన జోక్యం వల్ల ఎంతో మంది సీనియర్ నాయకులు చాలా కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. గతంలో విజయసాయి రెడ్డి కూడా సజ్జల ఆదిపత్యం వల్లే పార్టీకి దూరం కావాల్సి వచ్చిందనే ప్రచారం ఉంది. ఇప్పుడు సాయిరెడ్డి కొత్త వేదికను సిద్ధం చేస్తుండటంతో.. వైసీపీలో సజ్జలను తీవ్రంగా వ్యతిరేకించే నేతలంతా విజయసాయి రెడ్డి వైపు చూసే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. "శత్రువుకి శత్రువు మిత్రుడు" అన్న చందంగా.. వైసీపీలోని అసంతృప్త నేతలు, టికెట్లు రానివారు, ప్రాధాన్యత కోల్పోయిన వారు భారీగా సాయిరెడ్డి పార్టీ గూటికి చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు సమాచారం.
రాజకీయాల్లో ఓట్లు చీలిపోతే ఎంతటి నష్టం జరుగుతుందో జగన్‌కు బాగా తెలుసు. విజయసాయి రెడ్డి పెట్టబోయే పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే.. అది వైసీపీకి పడే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను, పార్టీ క్యాడర్ ఓట్లను భారీగా చీలుస్తుంది. జగన్ ఓటు బ్యాంక్‌ను దెబ్బకొట్టడమే సాయిరెడ్డి వ్యూహమా అనే చర్చ కూడా నడుస్తోంది. ఓట్లు చీలిపోతే అది ప్రత్యర్థి పార్టీలకు భారీ అడ్వాంటేజ్‌గా మారుతుంది. అందుకే ఈ ఓట్ల చీలికను ఆపకపోతే వైసీపీ కోలుకోలేని దెబ్బ తింటుందని జగన్ గ్రహించారు.
ఈ భారీ నష్టాన్ని ముందే పసిగట్టిన వైఎస్ జగన్.. విజయసాయి రెడ్డితో ఎలాగైనా రాజీ పడాలని చూస్తున్నట్లు అత్యంత నమ్మదగిన వర్గాల సమాచారం. సాయిరెడ్డిని మళ్లీ బుజ్జగించి, ఆయన కోరుకున్న ప్రాధాన్యతను ఇస్తూ, సజ్జల జోక్యాన్ని తగ్గించేలా హామీలు ఇచ్చి పార్టీ పెట్టకుండా ఆపాలని జగన్ దూతలను పంపుతున్నట్లు టాక్ నడుస్తోంది. కానీ, తిరుమలలో అంత బహిరంగంగా ప్రకటన చేసిన సాయిరెడ్డి.. జగన్ వేసే రాజీ ఫార్ములాకు లొంగుతారా? లేక తన రోడ్‌మ్యాప్‌తో ముందుకు వెళ్తారా అన్నది ఈ నెల చివరన జరిగే విజయవాడ సమావేశంలో తేలిపోనుంది. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి తీసుకోబోయే పొలిటికల్ స్టెప్ ఏపీ రాజకీయాల్లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ కాబోతోంది. మరి విజయసాయి రెడ్డి నిజంగానే కొత్త పార్టీ పెట్టి జగన్‌కు షాక్ ఇస్తారా? లేక జగన్ చేసే రాజీ ప్రయత్నాలకు ఒప్పుకుంటారా? అనేది చూడాలి.