Top story: సాదిక్ ‘దృశ్యం’ సినిమాను మించిన స్కెచ్..? ఫోన్లు వదిలేసి.. గెడ్డం గీసేసి.. కొత్త ఆధార్ కూడా.!

సూపర్ హిట్ సినిమా 'దృశ్యం'లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి హీరో రాంబాబు ఎలాంటి పక్కా ప్లాన్లు వేస్తాడో మనందరికీ తెలుసు. ఒక నిండు సంసారం, ముగ్గురు ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలవడానికి కారణమైన కాకినాడకు చెందిన సైకో సాదిక్ ఖాన్

Post Published By: dialnews
Updated : 26 August 2026, 12:37 PM IST

సూపర్ హిట్ సినిమా 'దృశ్యం'లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి హీరో రాంబాబు ఎలాంటి పక్కా ప్లాన్లు వేస్తాడో మనందరికీ తెలుసు. ఒక నిండు సంసారం, ముగ్గురు ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలవడానికి కారణమైన కాకినాడకు చెందిన సైకో సాదిక్ ఖాన్ కూడా సరిగ్గా అలాంటి స్కెచే వేశాడు. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకకూడదని మైండ్ బ్లోయింగ్ ప్లాన్ గీశాడు. కాకపోతే.. ఇక్కడ ఉన్నది సినిమా పోలీసులు కాదు కదా. అందుకే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ దాటుకుంటూ వెళ్లినా సరే.. వెంటాడి, వేటాడి మరీ కాలనాగును కటకటాల వెనక్కి నెట్టారు. అసలు సాదిక్ ఖాన్ వేసిన ఆ 'దృశ్యం' లెవెల్ స్కెచ్ ఏంటి?

ఏఈ నూకరాజు కుటుంబం మొత్తం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారం తెలియగానే.. సాదిక్ ఖాన్‌కు ఒక్కసారిగా కంగారెత్తిపోయింది. సూసైడ్ నోట్‌లో తన పేరే ఉంటుందని, ఇక తన పనైపోయిందని గ్రహించాడు. వెంటనే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు, తనకు సంబంధించిన అన్ని ఆధారాలను ఇంటి దగ్గరే వదిలేశాడు. ఎందుకంటే ఫోన్ ఆన్ లో ఉంటే పోలీసులు లొకేషన్ ఈజీగా కనిపెడతారని అతనికి తెలుసు. అక్కడికక్కడే ప్లాన్ మార్చి సామర్లకోట రైల్వే స్టేషన్‌కు పరుగు తీశాడు. అదృష్టవశాత్తూ అప్పుడే అక్కడ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రెడీగా ఉంది. వెనకా ముందు ఆలోచించకుండా ట్రెయిన్ ఎక్కేసి.. 'హమ్మయ్య.. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నా' అని ఊపిరి పీల్చుకున్నాడు.

కానీ, పోలీస్ బ్రెయిన్‌ను చాలా తక్కువ అంచనా వేసిన సాదిక్ ఖాన్.. కంగారులో తెలియకుండానే ఒక పెద్ద క్లూ ఇచ్చేసాడు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కగానే రైళ్లో తన పక్కన ఉన్న ఒక సహప్రయాణికుడితో చాలా క్లోజ్‌గా పరిచయం చేసుకున్నాడు. అత్యవసరం అని చెప్పి అతని మొబైల్ ఫోన్ తీసుకుని.. తన కుటుంబ సభ్యులతో పాటు, ఒక లాయర్‌తో కూడా మాట్లాడాడు. మాట్లాడటం అయిపోగానే ఆ ఫోన్ అతనికి ఇచ్చేశాడు. కానీ సాదిక్ చేసిన ఈ ఒక్క పనే.. పోలీసులు అతడి వెనక పడేలా చేసింది. టెక్నాలజీని వాడిన కాకినాడ పోలీసులు.. సాదిక్ ఇంట్లో వాళ్లకు ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో కనిపెట్టి, వెంటనే ఆ ప్రయాణికుడి నంబర్‌ను ట్రాక్ చేసి ఆరా తీశారు.

అయితే ఆ ప్రయాణికుడు.. అతని గురించి నాకేమీ తెలియదని, కర్ణాటకలోని ఒక రైల్వే స్టేషన్‌లో దిగిపోయాడని పోలీసులకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ కర్ణాటక రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. అక్కడ సాదిక్ ఖాన్ ఒక స్థానిక వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని విచారించగా.. సదరు వ్యక్తి సాదిక్ ఖాన్ తనను 'సోలాపూర్' వెళ్లే బస్సు ఎక్కడ దొరుకుతుందని అడిగాడని చెప్పాడు. సోలాపూర్ నుంచి ఢిల్లీ.. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని మీరట్.. ఇలా తాను పోలీసులకు ముసుగు వేసి మస్కా కొడుతున్నానని సాదిక్ అనుకున్నాడు.

కానీ "నిను వీడని నీడను నేను" అంటూ పోలీసులు తన వెనకాలే పడ్డారనే విషయం వాడికి తెలీదు. ఈ లోపే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాదిక్ తన రూపాన్ని పూర్తిగా మార్చేశాడు. తనకున్న గెడ్డాన్ని మొత్తం తీసేసాడు, బట్టలు మార్చేశాడు. అంతేకాదు, నకిలీ పేరుతో కొత్త ఆధార్ కార్డు సంపాదించడానికి కూడా ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. రూపం మార్చినా, రూట్లు మార్చినా.. కాకినాడ పోలీసుల నిఘా నేత్రం ముందు సాదిక్ ఆటలు సాగలేదు. సాదిక్ ఖాన్ మీరట్ లోని ఒక రహస్య ప్రాంతంలో దాక్కున్నాడని పక్కా సమాచారం సేకరించిన స్పెషల్ పోలీస్ టీమ్స్.. స్థానిక పోలీసుల సహాయంతో చుట్టుముట్టి చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఐదు రాష్ట్రాల సరిహద్దులు దాటుకుంటూ, సినిమాలను మించిన రేంజ్‌లో తప్పించుకోవాలని ఎంత ట్రై చేసినా.. చివరికి ఆ కన్నింగ్ కాలనాగు సాదిక్ ఖాన్ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని కాకినాడకు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ విచారణ జరుపుతున్నారు.

Published : 
  • 26 August 2026, 12:37 PM IST