Top story: 48 కేజీల బంగారు వినాయకుడు డైమండ్స్‌తో అలంకరణ.. నిమజ్జనం ఎక్కడ చేస్తారంటే..!

ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న వేల భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన ఒక వినాయకుడి విగ్రహం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇది మామూలు విగ్రహం కాదు. ఏకంగా బంగారు పూత పూసిన వినాయక విగ్రహం.

Post Published By: dialnews
Updated : 15 September 2026, 2:52 PM IST

ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న వేల భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన ఒక వినాయకుడి విగ్రహం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇది మామూలు విగ్రహం కాదు. ఏకంగా బంగారు పూత పూసిన వినాయక విగ్రహం. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ వ్యాపార కేంద్రమైన బేగంబజార్ ఫీల్‌ఖానా వద్ద నిలిపిన గణేశుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బేగంబజార్‌లోని 'లీ-చీ కా రాజా' మండపంలో ప్రతిష్టించిన ఈ వినాయకుడి విగ్రహాన్ని 24 క్యారెట్ల బంగారు పూతతో రూపొందించారు. అంతే కాకుండా సుమారు 3.8 లక్షల కంటే ఎక్కువ అమెరికన్ వజ్రాలతో అత్యంత సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ వినాయక విగ్రహం బరువు సుమారు 48 కిలోలు ఉంటుంది. దీనిని పంచలోహాలతో తయారు చేశారు. ఇత్తడి బేస్‌పై 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ ప్లేటింగ్ వేసి డిజైన్ చేశారు.

విగ్రహం వెనుక భాగంలో దశావతారాలు కొలువుదీరగా, పైభాగంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి డిజైన్‌తో కూడిన మకుటం ఆధ్యాత్మిక శోభను ఇస్తోంది. ముంబైలోని ప్రముఖ లాల్‌బాగ్ కా రాజా ఆకృతి ప్రేరణతో పాటు తిరుమల శ్రీవారి దివ్య రూపాన్ని సమ్మేళనం చేస్తూ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. స్థానిక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీదారుల నైపుణ్యాన్ని చాటేలా 'లీచీ పర్ల్స్ అండ్ జ్యువెలరీ' నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. ఎనిమిది మంది నైపుణ్యం కలిగిన నిపుణులైన స్వర్ణకారులు మరియు కళాకారులు దాదాపు 8 నెలల పాటు శ్రమించి ఈ ప్రతిమను అత్యంత సూక్ష్మమైన పనితనంతో సిద్ధం చేశారు.

ఈ ఆభరణాల పనితనంతో కూడిన విగ్రహాన్ని బేగంబజార్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఇది మూడో సంవత్సరం. గోల్డ్-ప్లేటింగ్ మరియు మెరిసే ఆర్టిఫిషియల్ డైమండ్ల కాంతులతో ధగధగలాడుతున్న ఈ 'గోల్డ్ ప్రిన్స్' వినాయకుడిని దర్శించుకోవడానికి నగర నలుమూలల నుంచి భక్తులు, వ్యాపారులు బేగంబజార్‌కు పోటెత్తుతున్నారు. విగ్రహం అత్యంత విలువైనది మరియు ప్రతి ఏటా ప్రదర్శించేది కావడం వల్ల, 11 రోజుల వేడుకలు, ప్రత్యేక పూజల అనంతరం ఈ బంగారు విగ్రహానికి బదులుగా ప్రతిరూపంగా రూపొందించిన మట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. భక్తి, కళాత్మకత మరియు పర్యావరణ పరిరక్షణల కలబోతగా నిలిచిన ఈ ‘బంగారు గణపతి’ ఈ ఏడాది హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లోనే సరికొత్త ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.

Published : 
  • 15 September 2026, 2:52 PM IST