ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ వాడకం ఏ స్థాయికి చేరిందంటే.. బిక్షగాళ్లు కూడా క్యూఆర్ కోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. అంత ప్రాచుర్యం పొందిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ 'యూపీఐ' మీద కేంద్ర ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. NPCI కీలక ప్రకటన చేశాయి. మర్చంట్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. అయితే ఇవి అందరికీ కాదు, అన్ని లావాదేవీలకూ కాదు. సాధారణంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి జరిపే యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇవి ఎప్పటిలాగే పూర్తిగా ఉచితం. వ్యాపారులకు చేసే చెల్లింపులపై 2 వేల వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు.
2 వేలు దాటిన వాణిజ్య లావాదేవీలపై మాత్రమే 0.4% ఎండీఆర్ ఛార్జీ వర్తిస్తుంది. ఈ ఎండీఆర్ ఛార్జీకి గరిష్ఠ పరిమితి 300గా నిర్ణయించారు. అంటే చెల్లింపు మొత్తం 75 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పటికీ గరిష్ఠంగా 300 మాత్రమే ఛార్జీ పడుతుంది. కీలక రంగాలైన విద్యుత్, టెలికాం, బీమా, పెట్రోల్, ఇంటర్నెట్, గ్యాస్ బిల్లులు, వ్యవసాయం ఈ రంగాలకు 2 వేలు మించిన చెల్లింపులపై ఫ్లాట్‌గా ఒక్కో లావాదేవీకి 5 రూపాయలు మాత్రమే ఛార్జీ వసూలు చేస్తారు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ బ్రోకర్లకు 0.02% ఎండీఆర్ విధించారు. నెలలో లక్ష లోపు చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు ఈ ఎండీఆర్ ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల దేశంలో దాదాపు 4% వాణిజ్య లావాదేవీలపై మాత్రమే ఈ ఎండీఆర్ ప్రభావం పడుతుంది.
వసూలయ్యే ఎండీఆర్ సొమ్ములో 5% నిధిని చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేటాయిస్తారు. 2020 జనవరిలో ప్రభుత్వం 'నేషనల్ పేమెంట్స్ యాక్ట్-2007'లోని సెక్షన్ 10A సవరణ ద్వారా యూపీఐపై జీరో ఛార్జీల విధానాన్ని తెచ్చింది. కానీ యూపీఐ నెట్వర్క్, సర్వర్ల నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ వంటి మౌలిక సదుపాయాల కోసం ఏటా 20 వేల కోట్లకు పైగా ఖర్చవుతోంది. క్రెడిట్/డెబిట్ కార్డులతో పోలిస్తే ఉచితంగా సేవలు అందించడం భారం కావడంతో బ్యాంకులు, పేమెంట్స్ సంస్థలు.. వీసా/మాస్టర్‌కార్డ్ లాంటి గ్లోబల్ గేట్‌వేల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో చట్టాన్ని సవరించి మళ్ళీ ఎండీఆర్ ఛార్జీలు అమలు చేయాలని నిర్ణయించారు. విపక్ష కాంగ్రెస్ దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
అమెరికా కంపెనీల ఒత్తిడికి తలొగ్గి విధించిన "మోదీ పన్ను" అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యాపారులపై పడే ఈ భారం చివరికి వినియోగదారులపైనే పడుతుందని, ఇది డోపిడీ అని మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా మండిపడ్డారు. ఈ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, డిజిటల్ ఇండియా విజయాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. 2016 ఆగస్టు 15న ప్రారంభమైన యూపీఐ వ్యవస్థ అద్భుత ప్రగతి సాధించింది. 2016-17లో 7 వేల కోట్లుగా ఉన్న లావాదేవీలు 2025-26 నాటికి ఏకంగా 314 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుతం భారత్‌తో పాటు సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, నేపాల్, శ్రీలంక, మారిషస్ సహా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్న ఈ చార్జీల నిర్ణయంతో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.