సిట్ లో కేసీఆర్ ని ఏం అడిగారు..? ఏం చెప్పాడు..?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో...సిట్‌ ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానాలు చెప్పారా ? లేదంటే నీళ్లు నమిలారా ? ఎలాంటి సమాధానాలు చెప్పకుండా దాటవేశారా ?

Post Published By: dialnews
Updated : 3 February 2026, 12:17 PM IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో...సిట్‌ ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానాలు చెప్పారా ? లేదంటే నీళ్లు నమిలారా ? ఎలాంటి సమాధానాలు చెప్పకుండా దాటవేశారా ? సిట్‌ అధికారులు...నాలుగున్నర పాటు ఎలాంటి ప్రశ్నలు సంధించారు ? ఫోన్‌ ట్యాపింగ్‌కు ఆదేశాలు...ఎవరి పేరుతో వెళ్లాయా ? ఇంతకీ సుప్రీం ఎవరు ? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్‌ ఇచ్చిన సమాధానం ఏంటి ? ఇప్పుడిదే హాట్‌టాపిక్‌గా మారింది.

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులు ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్‌ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌కు...పెద్దాయన పేరుతో ఆదేశాలు ఇచ్చిందెవరు ? ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావుపై అంత నమ్మకం ఏంటి ? మావోయిస్టుల పేరుతో ప్రత్యర్థి రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్‌ చేయమన్నది ఎవరు ? ప్రణీత్‌రావుకు ప్రమోషన్‌ ఎందుకు ఇచ్చారు ? ఇవి...సిట్‌ అధికారులు కేసీఆర్‌కు సంధించిన ప్రశ్నలు. నందినగర్‌లోని ఆయన నివాసంలో...సిట్‌ అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. రెండు ట్రంక్‌ పెట్టెల్లో కేసుకు సంబంధించిన కీలకమైన ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాధారాలను, కొన్ని రికార్డులను తీసుకుని వచ్చారు.

కేసీఆర్‌ విచారణను ఆసాంతం.. ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేశారు. మావోయిస్టుల పేరిట కొన్నివేల మంది ఫోన్లను ట్యాపింగ్‌ చేయించారా ? అంటూ సిట్‌ అధికారులు ప్రశ్నించగా.. అనుమతులు ఇచ్చేది తాను కాదని, ట్యాపింగ్‌కు సంబంధించి చట్టబద్ధమైన వ్యవస్ధ పనిచేస్తుందని కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం. రివ్యూ కమిటీ అనుమతు లు ఇస్తుందని చెప్పినట్లు సమాచారం. అనధికారికంగా, అక్రమ పద్ధతుల్లో నిఘా కొనసాగడం, ఫోన్‌ ట్యాపింగ్‌కు పా ల్పడటం ప్రభుత్వ అధినేతగా మీకు తెలిసే జరిగిందా ?

మీ అనుమతి లేకుండా ఇంత విస్తృత స్థాయిలో ఫోన్‌ ట్యాపింగ్‌కు అధికారులు సాహసిస్తారా ? అనే ప్రశ్నలను సైతం సిట్‌ అధికారులు సంధించినట్లు సమాచారం. మీ ప్రభుత్వంలో అడ్డగోలుగా ఫోన్‌‌ట్యాపింగ్‌‌ జరిగిన సంగతి మీకు తెలియదా? ఎవరి అవసరాల కోసం ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ చేశారు? బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫోన్‌‌ ట్యాపింగ్‌‌తోనే గుర్తించారా?.. మీరు ప్రెస్‌‌మీట్‌‌లో విడుదల చేసిన ఆడియోలు అవే కదా..? ఫోన్ ట్యాపింగ్‌‌ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అని కేసీఆర్‌కు ప్రశ్నాస్త్రాలు సంధించినట్లు తెలుస్తోంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు.. ఇంటెలిజెన్స్‌‌‌‌ వ్యవస్థ ఉన్నదే నిఘా కోసం కదా? ప్రతి ప్రభుత్వంలో నిఘా వర్గాలు పనిచేస్తాయి.. అది మీకు కూడా తెలుసు కదా? అవి డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ వాళ్లు అందించిన రికార్డులేఅని కేసీఆర్​ సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.

ప్రభుత్వ అధినేతగా మీకు తెలిసే ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందా ? మావోయిస్టుల పేరిట కొన్నివేల మంది ఫోన్లను ట్యాపింగ్‌ చేయించారా ? పదవీ విరమణ పొందిన అధికారులను కీలక బాధ్యతల్లో ఎందుకు కొనసాగించారు? పలు ఎన్నికల్లో గెలుపునకు ఫోన్‌ ట్యాపింగ్‌ మీకు ఒక ఆయుధంగా మారడం వల్లే దానిని కొనసాగించారా ? అన్న ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ సమాచారం ఆధారంగా బెదిరించడంతోనే బీఆర్‌ఎస్‌కి ఎలక్టోరల్‌ బాండ్లు పెద్ద మొత్తంలో వచ్చాయా ? అంటూ కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం తనకు తెలియదని..పార్టీకి కోశాధికారి, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉంటారని కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం.

గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి చోటుచేసుకున్న ఫాంహౌస్‌ వ్యవహారంపైనా కేసీఆర్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సీఎం హోదాలో బయటపెట్టిన కొన్ని ఆడియో రికార్డులను ఎవరు ఇచ్చారు ? ఆ కేసులో నిఘా, ఫోన్‌ ట్యాపింగ్‌ కొనసాగించాలని మీరే ఆదేశించారా? అనే ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.పార్లమెంట్‌ ఎన్నికలు, మునుగోడు, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా అనధికారికంగా వేలాది ఫోన్లు ట్యాపింగ్‌ మీ ఆదేశాలతోనే జరిగిందా ? ఈ వ్యవహారంలో కేటీఆర్‌, హరీశ్‌రావు, సంతోష్‌రావు పాత్ర ఉందా ? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇంటెలిజెన్స్ పొలిటికల్‌‌‌‌ వింగ్, టాప్‌‌‌‌ సీక్రెట్‌‌‌‌ సెల్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ డీఎస్పీగా విధులు నిర్వహించిన భుజంగరావు సహా ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి సమాచారం వచ్చేది ? వారి ద్వారా వచ్చిన ఫోన్‌‌‌‌నంబర్లను ట్యాపింగ్‌‌‌‌ చేయాలని మీరే చెప్పారా?.. లేక అధికారులే సొంతంగా చేశారా ? అని ప్రశ్నించినట్లు సమాచారం. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను సిట్‌‌‌‌ ప్రశ్నించే విధానంతోపాటు ఆయన చెప్పే సమాధానాలు పూర్తిగా చట్టపరిధిలోకి వచ్చే విధంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌‌‌‌ పరికరాలను ఏర్పాటు చేశారు. విచారణ అంతా వీడియో రికార్డింగ్ చేశారు.

అనధికార, అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలకపాత్ర పో షించిన అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ఆయన బృందంలోని ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలాలతోపాటు టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎవరిపైనిఘా పెట్టాలనే దానిపై తమకు సీఎంవో నుంచి ఆదేశాలు అందేవని...రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఇచ్చారు. దీని ఆధారంగా సిట్‌...మీరు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారా ? రాధాకిషన్‌రావుకు మీ ఆదేశాలు ఏ విధంగా అందేవి ? ప్రశ్నించినట్లు సమాచారం.

రాధాకిషన్‌రావు, ప్రభాకర్‌రావును పదవీ విరమణ తర్వాత కూడా...కీలక హోదాల్లో కొనసాగించడానికి కారణమేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిట్‌ అధికారులు పూర్తిస్థాయి సాక్ష్యాలు, డిజిటల్‌ ఆధారాలు, వాంగ్మూలాలను చూపించి  ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ ఆధారాల్లో రాజకీయనేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలకు సంబంధించి ఎస్‌ఐబీ రూపొందించిన ప్రొఫైల్స్‌లో కొన్నింటిని కేసీఆర్‌కు చూపించినట్లు సమాచారం. కేటీఆర్‌, హరీశ్‌రావు, సంతోష్‌రావును విచారించిన సందర్భం గా సేకరించిన కొన్ని ఆధారాలనూ కేసీఆర్‌ ముందు ప్రస్తావించినట్లు తెలిసింది.

Published : 
  • 2 February 2026, 2:46 PM IST