అందర్నీ భయపెడుతున్న ధురంధర్ 2.. ఇది ఇప్పుడు ఇండియన్ సినిమాలో నడుస్తున్న హాట్ టాపిక్. మార్చి 19న ఈ బాక్సాఫీస్ మాన్స్టర్ థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా మీద ఉన్న ఊహించని హైప్ చూస్తుంటే.. మిగిలిన సినిమాలకు పోటీ కంటే భయం ఎక్కువవుతోంది. అసలు ధురంధర్ 2 రిలీజ్ అయ్యే టైంలో థియేటర్ల వైపు కన్నెత్తి చూసేందుకే ఇతర నిర్మాతలు, హీరోలు వణికిపోతున్నారు. ధురంధర్ సృష్టించిన ఇంపాక్ట్ అలాంటిది మరి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి.. ఏకంగా 1400 కోట్లు వసూలు చేసింది ధురంధర్. అది కూడా ఒకే ఒక్క భాషలో.. ప్యాన్ ఇండియన్ రిలీజ్ లేకుండానే సింగిల్ లాంగ్వేజ్‌లో రప్ఫాడించింది ధురంధర్. అయితే అంతా బానే ఉన్నా తాజాగా విడుదలైన ధురంధర్ 2 టీజర్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారనే చెప్పాలి. మొదటి పార్ట్ ఇచ్చిన కిక్‌తో సీక్వెల్ నుంచి సరికొత్త విజువల్స్ ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.
మేకర్స్ కొత్త షాట్స్ ఏవీ చూపించకుండా.. మొదటి పార్ట్ ఎండ్ టైటిల్స్‌లో వేసిన పాత టీజర్‌నే మళ్లీ కట్ చేసి విడుదల చేసారు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు కంటెంట్ సిద్ధంగా ఉందా లేదా? ఒకవేళ సిద్ధంగా ఉంటే పాత టీజర్ ఎందుకు వదిలారు? అనే కొత్త డౌట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. టీజర్ కాస్త నిరాశపరిచినా.. సినిమాపై ఉన్న ఒరిజినల్ హైప్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆ హైప్ ఎంతలా ఉందంటే.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ యశ్‌ను సైతం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునేలా చేసింది. మార్చి 19న తన తాజా భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్ రిలీజ్ చేయాలని యశ్ భావించాడు. కానీ ధురంధర్ 2 క్రేజ్ చూశాక.. క్లాష్ ఎందుకని, రిలీజ్ డేట్ వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అలా కాదని రెండూ ఒకేరోజు వస్తే కచ్చితంగా ఇద్దరికీ భారీ నష్టం తప్పదు. ధురంధర్ 2 దెబ్బకు యశ్ లాంటి స్టార్ సైతం వెనకడుగు వేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇక పాన్ ఇండియా సినిమాల పరిస్థితే ఇలా ఉంటే.. టైర్ 2, టైర్ 3 సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ సైతం ధురంధర్ 2 భయంతో మార్చి 19 నుంచి ఏప్రిల్‌కు వాయిదా పడిందని సమాచారం. రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ లాంటి సినిమాలు కూడా షూటింగ్ ఆలస్యం కావడంతో అక్కడ్నుంచి తప్పుకున్నాయి. మార్చి మూడో వారం నుంచి బాక్సాఫీస్ బరిలోకి దిగాలంటే మిగతా సినిమాలకు కచ్చితంగా గట్స్ ఉండాల్సిందే. ఒక్క పవన్ కళ్యాణ్ ఉస్తాద్ మాత్రమే మార్చి 26న రానుంది. మొత్తానికి పరిస్థితులు చూస్తుంటే ధురంధర్ 2 వచ్చేటప్పటికి బాక్సాఫీస్ రూట్ మొత్తం ఆల్ క్లియర్ అయ్యేలా ఉంది. సినిమాకు అడ్డంకులు లేని సోలో రిలీజ్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే కనక జరిగితే.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు 2000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం కేక్ వాక్ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రికార్డులు తిరగరాయడానికి ధురంధర్ 2 సిద్ధమవుతుంటే.. ఆ దెబ్బకు మిగతా సినిమాలు సైలెంట్‌గా తప్పుకుంటున్నాయి.