మొన్నటికి మొన్న సీనియర్ నటుడు రఘునాథరెడ్డి మరణం ఇంకా మరిచిపోకముందే.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. వెండితెరపై, బుల్లితెరపై తనదైన నటనతో మెప్పించిన సీనియర్ నటి జయవాహిని ఉరఫ్ వాసవి ఇక లేరు. ఆమె వయసు 48 ఏళ్ళు. గత కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె.. ఫిబ్రవరి 4న తన సొంత గడ్డ అయిన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. జయవాహిని మరణాన్ని ప్రముఖ నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో ధృవీకరిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
పద్మక్కను కాపాడుకోవడానికి మేము శతవిధాలా ప్రయత్నించాం. కానీ కాలం ఆమెను మా నుంచి దూరం చేసింది. వైద్యులు పరిస్థితి విషమమని, ఇక కష్టమని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను విజయనగరం తీసుకెళ్లారు. అక్కడే ఆమె ప్రశాంతంగా కన్నుమూశారు. నీ ఆత్మకు శాంతి కలగాలి అక్క అంటూ కళ్యాణి తన ఫేస్బుక్ పోస్ట్‌లో కన్నీటి పర్యంతమయ్యారు. జయవాహినిని దగ్గర వాళ్లు పద్మ అని పిలుస్తుంటారు.1978లో విజయనగరంలో జన్మించిన వాసవి.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక జయవాహినిగా పేరు మార్చుకున్నారు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న వేషాలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆమె, తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, టీవీ సీరియల్స్ ద్వారా ప్రతి ఇంట్లోనూ సుపరిచితమయ్యారు.
ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను ఆమె పండించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2019లో వచ్చిన రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రంలో వీకే నరేష్ సరసన ఆమె పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇటీవలే విడుదలైన బహిర్భూమి చిత్రం ఆమె కెరీర్లో చివరి సినిమాగా నిలిచిపోయింది. గత కొన్నేళ్లుగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. ఆరోగ్యం క్షీణించడంతో నటనకు దూరమై చికిత్స పొందుతూ వచ్చారు. ఆమె పరిస్థితి మరింత విషమించడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆమెను స్వగ్రామానికి తరలించగా, అక్కడే ఆమె ప్రాణాలు విడిచారు. జయవాహిని మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.