హే భగవాన్ వినూత్న ప్రమోషన్.. ఆసక్తి రేపుతున్న ‘నాట్ ఏ ట్రైలర్’.. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి..?

వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుహాస్.. ఇప్పుడు ఈయన 'హే భగవాన్' అనే సరికొత్త ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 12 February 2026, 8:00 PM IST

వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుహాస్.. ఇప్పుడు ఈయన 'హే భగవాన్' అనే సరికొత్త ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గోపి అచ్చర దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివాని నాగరం కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి', 'ఈషా' వంటి వరుస విజయాల తర్వాత ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమ సినిమాలకు ఎప్పుడూ విభిన్నమైన ప్రచార వ్యూహాలను అనుసరించే ఈ నిర్మాతలు.. ఈ సినిమా కోసం కూడా రొటీన్‌కు భిన్నమైన పంథాను ఎంచుకున్నారు.

సాధారణంగా ఏ సినిమాకైనా ట్రైలర్ విడుదల చేయడం ఆనవాయితీ. కానీ 'హే భగవాన్' చిత్ర బృందం మాత్రం 'నాట్ ఏ ట్రైలర్' పేరుతో ఒక వినూత్నమైన ప్రమోషనల్ వీడియోను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ వీడియోను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోలో సినిమా కథను ఏమాత్రం రివీల్ చేయకుండా, అసలు సినిమాలో ఉన్న 'హే భగవాన్ బిజినెస్' అంటే ఏమిటనే సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తూ, ఆ సీక్రెట్ చుట్టూ అల్లిన డ్రామాను చాలా ఫన్నీగా చూపించారు. కొన్ని సినిమాలకు రెగ్యులర్ ట్రైలర్ కట్ చేయడం సాధ్యం కాదని చమత్కరిస్తూనే, ప్రమోషనల్ కంటెంట్‌ను కూడా ఒక ఎంటర్టైన్మెంట్‌లా మలిచారు.

తండ్రి నరేష్ వ్యాపారాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి సుహాస్ చేసే ప్రయత్నాలు, దానికి సుదర్శన్ వేసే పంచులు నవ్వులు పూయిస్తున్నాయి. ఇప్పటికే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న సుహాస్, ఈ సినిమాలో తన మార్క్ కామెడీ టైమింగ్‌తో మరోసారి మెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. శివాని నగరంతో సుహాస్ కెమిస్ట్రీ, వివేక్ సాగర్ అందించిన ఎనర్జిటిక్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

బన్నీ వాస్ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యాకింగ్ ఉండటం, ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా.. కథలో ఏదో తెలియని కొత్త పాయింట్ ఉందని 'నాట్ ఏ ట్రైలర్' ద్వారా హింట్ ఇచ్చిన చిత్ర బృందం, ఫిబ్రవరి 20న థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది.

Published : 
  • 12 February 2026, 8:00 PM IST