'కిమ్ జు యే'. 2026 ప్రారంభం నుంచీ గ్లోబల్ పాలిటిక్స్‌లో రీసౌండ్ ఇస్తున్న పేరిది. ఆమె నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కావడం వల్ల ఈ చర్చ జరగడం లేదు. కిమ్ తర్వాత పాలనా పగ్గాలు స్వీకరించబోతున్న యంగెస్ట్ గర్ల్‌గా నిలవబోతోందన్న ప్రచారమే ఆమెను గ్లోబల్ డిబేట్‌కు కేరాఫ్ అడ్రెస్ చేసింది. జనవరి 1న దేశ రాజధాని ప్యోంగ్యాంగ్లోని 'కుమ్ సుసాన్ ప్యాలస్ ఆఫ్ ది సన్'ను 'కిమ్ జు యే' తండ్రితో కలిసి సందర్శించిన ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ ప్యాలస్‌లో ఉన్న తన తాత కిమ్ జోంగ్ ఇల్ 'కిమ్ జోంగ్ 2', ముత్తాత 'కిమ్ 2 సంగ్'ల సమాధుల ఎదుట తల్లిదండ్రులతో కలిసి కిమ్ జు యే వినమ్రంగా నిల్చుంది. నాటి నుంచే కిమ్ వారసురాలు అతడి కుమార్తనే అని వార్తలు వచ్చాయి. తాజాగా సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ నివేదిక ఆ వార్తను కన్ఫమ్ చేసేసింది. కిమ్ వారసురాలిగా 'కిమ్ జు యే'ను ఎప్పుడైనా ప్రకటించవచ్చని సంచలన నివేదిక బయటపెట్టింది.
గతంలో కిమ్ జు యే కేవలం "శిక్షణలో ఉన్న వారసురాలు" అని భావించిన NIS, ఇప్పుడు ఆమెను "సక్సెసర్-డెసిగ్నేట్" అంటే వారసురాలిగా నిర్ణయించబడిన వ్యక్తిగా పేర్కొంది. ఈ నెలలో జరగబోయే వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సమావేశంలో పాల్గొంటే, ఆమె వారసత్వంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ద్వారా 1948 నుంచి ఇప్పటిదాకా కిమ్ కుటుంబమే నార్త్ కొరియాను ఏలుతోంది. 1948 నుంచి 1994 వరకు కిమ్ 2 సంగ్, 1994 నుంచి 2011 వరకు కిమ్ జోంగ్ 2 ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా, నిరంకుశంగా ఏలారు. 2011 నుంచి ఉత్తర కొరియా అధికార పీఠంపై కిమ్ జోంగ్ 2 కుమారుడు కిమ్ జోంగ్ ఉన్ ఉన్నారు. కిమ్ జోంగ్ ఇల్, కిమ్ 2 సంగ్, కిమ్ జోంగ్ ఉన్‌లు సైతం దేశ పాలక పగ్గాలను చేపట్టే ముందు వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో వివిధ కీలక పదవీ బాధ్యతలను నిర్వర్తించారు. ఇప్పుడు ఆ దిశగానే కూతురినీ కిమ్ జోంగ్ ఉన్ రెడీ చేస్తున్నారని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ చెబుతోంది.
ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ వయసు 41 ఏళ్లు కాగా, ఆయన కూతురు కిమ్ జు యే వయసు 14 ఏళ్లు. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో ఆమెకు తగిన నాయకత్వ తర్ఫీదును అందించాలని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నారని చాలా కాలంగా నివేదికలు చెబుతున్నాయి. రాబోయే కొన్నేళ్లలో జాతీయ, అంతర్జాతీయ, దౌత్య, సైనిక, పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకొని, ఆమె తన రాజకీయ వారసురాలిగా ఎదగగలదని కిమ్ ఆశిస్తున్నారట. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సమావేశాలకు ముందు కుటుంబానికి అత్యంత పవిత్రమైన 'కుమ్ సుసాన్ ప్యాలస్ ఆఫ్ ది సన్'కు కిమ్ జు యే వెళ్లడం కీలక పరిణామమే అని ఉత్తర కొరియా వ్యవహారాల పరిశీలకుడు, దక్షిణ కొరియాలోని సెజాంగ్ ఇన్స్టిట్యూట్ డిప్యూటీ హెడ్ చియాంగ్ సెయాంగ్ చాంగ్ జనవరిలో అభిప్రాయపడ్డారు. వర్కర్స్ పార్టీలో నంబర్ 2 స్థాయిని కలిగిన మొదటి సెక్రెటరీ పదవిని కిమ్ తన కూతురికి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. వయసు తక్కువగా ఉన్నందున, ప్రస్తుతానికి ఆమెకు చిన్న పదవినే కేటాయించే ఛాన్స్ ఉందని మరికొందరు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలీజెన్స్ సర్వీస్ ప్రకారం, తొలిసారిగా 2022 నవంబరులో మీడియా ఎదుటకు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు యే వచ్చింది. తన తండ్రి పక్కనే కూర్చొని మిలిటరీ పరేడ్లను, మిస్సైల్ ప్రయోగ పరీక్షలను వీక్షించింది. మూడేళ్లలో ఉత్తర కొరియాలోని వివిధ ప్రాంతాల పర్యటనకు కిమ్ జోంగ్ ఉన్‌తో పాటు కిమ్ జు యే కూడా వెళ్లింది. 2025 సెప్టెంబరులో చైనా పర్యటనకి తన కూతురిని కిమ్ జోంగ్ ఉన్ తీసుకెళ్లారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కూతురిని తీసుకెళ్లడం ద్వారా, భావి పాలకురాలు, తన వారసురాలు ఆమెనే అనే సందేశాన్ని ఉత్తర కొరియా ప్రజల్లోకి కిమ్ పంపుతున్నారని ఎన్ఐఎస్ పేర్కొంది. త్వరలో జరగబోయే వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సమావేశాల్లో కిమ్ నుంచి అధికారిక ప్రకటన ఏమైనా నార్త్ కొరియాకు ఒక బాలిక అధ్యక్షురాలు కావడం ఖాయం. కానీ, కుమార్తె విషయంలో కిమ్ జోంగ్ ఉన్ ఎందుకింత తొందర పడుతున్నాడు?
నిజానికి.. 2020లోనే కిమ్ అనారోగ్యానికి గురయ్యాడనే వార్తలు వచ్చాయి. అప్పుడే ఆయన సోదరి కిమ్ యో-జోంగ్ దేశానికి నాయకత్వం వహిస్తారని వార్తలు ఊపందుకున్నాయి. కిమ్ పిల్లలు వయసుకు వచ్చేవరకు ఆమె నాయకురాలి పాత్రలో కొనసాగుతారని చాలా మంది నిపుణులు విశ్లేషించారు. పైకి బాగానే కనిపిస్తున్నా.. కిమ్ తన ఆరోగ్యం విషయంలో ఆందోళనగా ఉన్నట్టు చాలా కాలంగా చర్చ నడుస్తోంది. అందుకే, 14 ఏళ్లకే కుమార్తెకు పగ్గాలు ఇవ్వాలనుకుంటున్నట్టు నివేదికలు అంచనా వేస్తున్నాయి. మరి ఈమె ఎంట్రీ అయినా నార్త్ కొరియన్ల జీవితాలను మారుస్తుందా? అంటే అందుకు అవకాశాలు లేకపోలేదు. కొత్త తరం నాయకురాలిగా, ఉన్నత విద్యావంతురాలిగా దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పితృస్వామ్య భావాలు ఎక్కువగా ఉన్న ఉత్తర కొరియాలో ఆమె రాక ఒక సామాజిక మార్పుకు సంకేతం కావచ్చు కూడా. కానీ, అందుకు కిమ్ అనుమతించాలి. కిమ్ కుటుంబం తమ మనుగడకు అణ్వాయుధాలే రక్షణ అని నమ్ముతుంది. ఆమె కూడా అదే బాటలో నడిస్తే అంతర్జాతీయ ఆంక్షలు తొలిగే అవకాశం ఉండదు, ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. కిమ్ ఉన్నంతవరకూ ఇదే పరిస్థితి ఉండొచ్చు.