పాకిస్తాన్ సూపర్ లీగ్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. అప్ఘనిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో పాక్‌లో పరిస్థితులు టెన్షన్ టెన్షన్‌గా మారాయి. మొన్నటి వరకు పాక్‌కు రావడానికి ఆసీస్ ప్లేయర్లు వెనుకంజ వేస్తే.. ఇప్పుడు పక్కదేశమైన బంగ్లాదేశ్ కూడా వస్తుందో రాదో అన్న స్పష్టత లేకుండా పోయింది. టీ20 వరల్డ్‌కప్ 2026లో బంగ్లాదేశ్‌కు పాక్ ఫుల్ సపోర్ట్ చేస్తే, ఇప్పుడు బంగ్లా పీఎస్ఎల్లో ఆడటానికి కూడా ఆలోచిస్తోంది. త్వరలో పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం అవ్వనుండగా ఇప్పటివరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆ దేశ ప్లేయర్లకు అనుమతి ఇవ్వడం లేదు.భద్రతా సమస్యలు ఉంటే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో తమ దేశ ఆటగాళ్లు పాల్గొనరని ఇప్పటికే బంగ్లాదేశ్ క్రీడా శాఖ మంత్రి అమినుల్ ఇస్లాం వెల్లడించారు.
అయితే, దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక సమాచారం వచ్చిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం ముస్తాఫిజుర్ రెహ్మాన్, పర్వేజ్ హోసన్, షోరిఫుల్ ఇస్లాం, నహీద్ రానా, తంజిద్ హాసన్ తమిమ్, రిషన్ హోసన్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ కూడా అందించింది. అయినప్పటికీ, ఈ ప్లేయర్లంతా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా మారింది.
భద్రతా సమస్యలు ఉన్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావిస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026కి బంగ్లా ప్లేయర్స్ హ్యాండ్ ఇచ్చినట్టే.అప్ఘనిస్తాన్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 షెడ్యూల్‌ను పీసీబీ పూర్తిగా సవరించింది. మ్యాచ్‌లన్నీ కేవలం కరాచీ, లాహోర్‌లో మాత్రమే నిర్వహించాలని.. అదీ కూడా ప్రేక్షకులు లేకుండానే ఆడించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్‌లో పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు టోర్నీ నుంచే తప్పుకున్నారు. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 నిర్వహణే అగమ్యగోచరంగా మారింది.