Top story: సింధు నదీ జలాల వివాదంలో భారత్ కు బిగ్ షాక్.. పాకిస్తాన్ కు ఫేవర్ గా తీర్పు వచ్చిందా..?

భారతదేశానికి, పాకిస్తాన్‌కు మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న "సింధు నదీ జలాల ఒప్పందం" చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. నెదర్లాండ్స్‌లోని ‘ది హేగ్’ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం

Post Published By: dialnews
Updated : 4 September 2026, 8:16 AM IST

భారతదేశానికి, పాకిస్తాన్‌కు మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న "సింధు నదీ జలాల ఒప్పందం" చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. నెదర్లాండ్స్‌లోని ‘ది హేగ్’ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం భారత్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన ఒక సంచలన తీర్పును ఢిల్లీ అధికారికంగా తిరస్కరించింది. ఆ కోర్టుకు అసలు చట్టబద్ధతగానీ, భారత్ యొక్క సార్వభౌమ నిర్ణయాలపై తీర్పులు ఇచ్చే పరిధిగానీ లేదంటూ భారత విదేశాంగ శాఖ అత్యంత ఘాటుగా సమాధానం ఇచ్చింది. అసలు ఈ సింధు నదీ జలాల ఒప్పందం ఏంటి? భారత్ కడుతున్న కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టులపై వివాదం ఎందుకు వచ్చింది? ది హేగ్ కోర్టు తీర్పును భారత్ ఎందుకు బేఖాతరు చేస్తోంది?

కథ మొత్తం 1947 దేశ విభజన దగ్గర మొదలవుతుంది. భారతదేశం, పాకిస్తాన్‌లు విడిపోయినప్పుడు.. సింధు నదీ వ్యవస్థ, దాని ఉపనదుల నెట్‌వర్క్ రెండు దేశాల సరిహద్దుల మధ్య నలిగిపోయింది. పాకిస్తాన్ వ్యవసాయం మొత్తం ఇండియా నుంచి ప్రవహించే నదీ జలాలపైనే ఆధారపడి ఉంది. దీంతో భవిష్యత్తులో నీటి యుద్ధాలు రాకుండా ఉండేందుకు 1960లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ‘సింధు నదీ జలాల ఒప్పందం’ కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం.. తూర్పు వైపు ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు ఇచ్చారు. పశ్చిమ వైపు ఉన్న సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిని పాకిస్తాన్‌కు కేటాయించారు. అయితే, పశ్చిమ నదులపై భారత్ కేవలం విద్యుత్ ప్రాజెక్టులు కట్టుకోవడానికి కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చారు. ప్రస్తుత వివాదం మొత్తం జమ్మూ కాశ్మీర్‌లో భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న "కిషన్‌గంగ", "రాట్లే" హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతోంది.

ఈ ప్రాజెక్టుల డిజైన్లు ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయంటూ పాకిస్తాన్ 2015 నుండి గొడవ మొదలుపెట్టింది. ఇక్కడే ఒక విచిత్రమైన అంతర్జాతీయ డ్రామా జరిగింది. ఈ వివాద పరిష్కారానికి భారత్ ఒక ‘న్యూట్రల్ ఎక్స్‌పర్ట్’ ను నియమించాలని కోరగా.. పాకిస్తాన్ మాత్రం మొండిగా ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’ కావాలని పట్టుబట్టింది. వరల్డ్ బ్యాంక్ ఏమో తప్పు చేస్తూ.. ఇద్దరి అభ్యర్థనలను అంగీకరించి ఒకేసారి ఇటు నిపుణుడిని, అటు కోర్టును రంగంలోకి దించింది. ఒప్పందం ప్రకారం ఒక మెకానిజం నడుస్తున్నప్పుడు.. సమాంతరంగా అంతర్జాతీయ కోర్టును ఎలా ఏర్పాటు చేస్తారంటూ భారత్ ఆ కోర్టు విచారణలను పూర్తిగా బహిష్కరించింది.

2025 జనవరిలో న్యూట్రల్ ఎక్స్‌పర్ట్ కూడా ఈ సాంకేతిక అంశాలు తన పరిధికే వస్తాయని స్పష్టం చేయడంతో భారత్ వాదనకు అంతర్జాతీయంగా బలం చేకూరింది. అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. గత ఏడాది 2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నిరంతరం సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, మన సైనికులను చంపుతుంటే.. మేము మాత్రం ఆ దేశానికి నీళ్లు ఇస్తూ కూర్చోవాలా? అంటూ ఈ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.

"రక్తం, నీళ్లు ఒకేసారి ప్రవహించలేవు" అనే పాత నినాదానికి కట్టుబడి.. ఈ ఒప్పందాన్ని సవరించాలని పాక్‌కు గట్టి నోటీసులు ఇచ్చింది. ఒప్పందాన్ని అటకెక్కించడమే కాకుండా, కాశ్మీర్ పరిధిలో పశ్చిమ నదులపై పెండింగ్‌లో ఉన్న అన్ని ఇరిగేషన్, హైడ్రో ప్రాజెక్టుల పనులను భారత్ శరవేగంగా పరుగులు పెట్టిస్తోంది. దాంతో పాకిస్తాన్ భయంతో వణికిపోతూ అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించింది. భారత్-పాక్ మధ్య గతంలో 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినా నడవని ఈ జలాల నిలిపివేత.. ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న కఠిన వైఖరి వల్ల ఇప్పుడు పూర్తిగా ఆగిపోయేలా కనిపిస్తోంది. ది హేగ్ కోర్టు భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి రూలింగ్స్ ఇచ్చినా.. ‘మేము దాన్ని అస్సలు గుర్తించం, మా దేశ సార్వభౌమత్వ నిర్ణయాలలో వేలు పెట్టే హక్కు ఎవరికీ లేదు’ అని కేంద్రం తేల్చి చెప్పడం మోదీ ప్రభుత్వ నిర్ణయంలో ఉన్న పట్టుదల పడుతోంది.

Published : 
  • 4 September 2026, 8:16 AM IST