2029 ఎన్నికల కోసం కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయించింది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచితే...ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్ణయానికి అడ్డు చెప్పరనే ఉద్దేశ్యంతో ఉంది. మరోవైపు పార్లమెంట్ స్థానాల పెంపుతో ఉత్తరాది రాష్ట్రాలే లబ్ది పొందనున్నాయని... దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోతుందనే ప్రచారం జరుగుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...నాలుగోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఊహించని నిర్ణయాలతో ప్రతిపక్షాలకు షాక్ ఇస్తున్నారు. 2024 ఎన్నికల ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ఆ వర్గాల ప్రజలను తనవైపు తిప్పుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి...ముచ్చటగా మూడోసారి ప్రధాని మంత్రి అయ్యారు. తాజాగా 2029 ఎన్నికలను టార్గెట్గా పెట్టుకున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50శాతం పెంచాలని నిర్ణయించింది. లోక్సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాలు 263కు తెలంగాణలో 179కి చేరతాయి. నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చేలా బిల్లు తెచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త బిల్లు ప్రకారం...లోక్సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. దేశవ్యాప్తంగా 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185కి చేరతాయి.
కేంద్రం నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు భారీగా లబ్ది చేకూరనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22 పార్లమెంట్, 148 అసెంబ్లీ పెరగనున్నాయి. ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. కొత్త బిల్లు ప్రకారం 263 అసెంబ్లీ స్థానాలు కానున్నాయి. ఇటు తెలంగాణలో ప్రస్తుత 119అసెంబ్లీ స్థానాలు ఉంటే... 179కి పెరుగుతాయి. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పెరగడంతో...రాజకీయ ప్రాతినిధ్యం పెరగనుంది. అంతేకాకుండా కొత్త నేతలకు అవకాశాలు రానున్నాయి. లోక్సభ సీట్ల పెంపు ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యత పెరగనుంది.
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర నామమాత్రమే కానుందనే ప్రచారం జరుగుతోంది. అయితే జనగణన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే దక్షిణాది ప్రాంతానికి అన్యాయం జరగుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వల్ల అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం.
-
లోక్సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడానికి వీలుగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగానే మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లులు తీసుకురాబోతున్నట్లు సమాచారం. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది. చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి...వచ్చే 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరగనున్నాయి.
2023 సెప్టెంబరులో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావాల్సి ఉంది. భారత రాజ్యాంగంలోని అధికరణలు 170(3), 81(3) ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిబంధన ఉంది. అందుకే కేంద్రం మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తెస్తుందని ఇప్పటివరకూ భావించారు. ఇప్పుడు జనగణన 2027 మార్చి 1కల్లా పూర్తి కానుంది. దీంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది కేంద్రం.