పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. లాహోర్ ఖలందర్స్ జట్టు బాల్ ట్యాంపరింగ్ చేసిందనే ఆరోపణలు రావడం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఫఖర్ జమాన్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని.. అదే సమయంలో షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్ కూడా పక్కపక్కనే ఉన్నట్లు కెమెరాకు చిక్కింది.కరాచీ కింగ్స్ - లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. కరాచీ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్ చివరి ఓవర్‌కి ముందు ఈ వివాదం మొదలైంది. కరాచీ జట్టు గెలవడానికి ఆఖరి ఓవర్‌కు 14 పరుగులు అవసరమయ్యాయి. కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది ఆఖరి ఓవర్‌ను హారిస్ రవూఫ్‌కి ఇచ్చాడు.
ఆఖరి ఓవర్ కావడం, 14 పరుగులు చేయాల్సి ఉండటంతో ఫఖర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బౌలర్ రన్ అప్ దగ్గర మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఫఖర్ జమాన్‌తో పాటు అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బంతిని ఉద్దేశ పూర్వకంగా ఏదో చేసినట్లు కెమెరాకు చిక్కింది. పక్కనే ఉన్న అంపైర్ ఫైజల్ అఫ్రిది కూడా ఆ ముగ్గుర్నీ గమనిస్తూనే ఉన్నాడు.బాల్ ట్యాంపరింగ్‌కు గురైందని గమనించిన అంపైర్ వెంటనే బంతిని తన చేతుల్లోకి తీసుకుని చెక్ చేశాడు. సెకండ్ అంపైర్‌కి కూడా బంతిని చూయించి.. బాల్ ట్యాంపరింగ్‌కు గురైనట్లు నిర్ధారించాడు. లాహోర్ ప్లేయర్లు చేసిన తప్పుకు కరాచీ జట్టుకు ఐదు అదనపు పరుగులు ఇవ్వడమే కాకుండా, కొత్త బంతిని కూడా తీసుకొచ్చారు. దాంతో కరాచీ టార్గెట్ 14 పరుగులు నుంచి 9కి తగ్గింది. హారిస్ రవూఫ్ వేసిన ఆఖరి ఓవర్లో అబ్బాస్ అఫ్రిది ఫోర్, సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
మ్యాచ్ అనంతరం ఈ బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంపై తీవ్ర చర్చ కొనసాగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సీరియస్‌గా తీసుకుంది. అయితే, బాల్ ట్యాంపరింగ్ చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలను ఫఖర్ ఖండించాడు. మరో 48 గంటల్లో విచారణ జరగనుంది. ఆ విచారణలో ఫఖర్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. గతంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి కఠిన శిక్షలు అనుభవించిన విషయం తెలిసిందే. మరి ఫఖర్‌పై కూడా అలాంటి చర్యలే తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.