Top story: మీ నెల బడ్జెట్‌ 4వేలు తేడా వస్తే… కొత్త ఆర్థిక సంవత్సరం-కొత్త సమస్యలు…!

ఏప్రిల్ 1 వచ్చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే...ఎన్నో ఎన్నెన్నో. ధరల మంట మండనుంది. కమర్షియల్ సిలిండర్ నుంచి విమాన ఇంధన చార్జీలు

Post Published By: dialnews
Updated : 2 April 2026, 12:10 PM IST

ఏప్రిల్ 1 వచ్చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే...ఎన్నో ఎన్నెన్నో. ధరల మంట మండనుంది. కమర్షియల్ సిలిండర్ నుంచి విమాన ఇంధన చార్జీలు దాకా అన్ని పెరిగాయి. డిజిటల్‌ పేమెంట్స్‌ను ఆర్బీఐ మరింత కట్టుదిట్టం చేసింది. 10 లక్షలు దాటితే పాన్‌ కార్డు సమర్పించాల్సి ఉంటుంది..
కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. నేటి నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. పన్నులు, పన్ను శ్లాబులు యథాతథంగా కొనసాగుతాయి. గతంలో ఫైనాన్షియల్‌ ఇయర్‌, అసెస్‌మెంట్‌ ఇయర్‌గా వ్యవహరించేవారు. దీంతో పన్ను చెల్లింపుదారులు గందరగోళానికి గురయ్యేవారు.

ఇకపై ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే కాలాన్ని ట్యాక్స్‌ ఇయర్‌గా వ్యవహరించనున్నారు. దీని ప్రకారం 12 లక్షల దాకా వార్షిక ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ 75 వేలు కలుపుకొంటే 12.75 లక్షల వరకు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక 25 వేలుగా ఉన్న రిబేట్‌ను 60 వేలకు పెంచారు. కొత్త లేబర్ కోడ్ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. ప్రస్తుతం చాలా కంపెనీల్లో బేసిక్ పే 30-40% మాత్రమే ఉంటోంది. ఇది 50 శాతానికి పెరగడంతో పీఎఫ్‌, గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. ఇంటి అద్దె భత్యం కింద తమ మూల వేతనంలో 50% పన్ను మినహాయింపు పొందే నగరాల జాబితాను కేంద్రం పెంచింది. హెచ్‌ఆర్‌ఏ కింద మినహాయింపులు పొందాలంటే అద్దెదారు, ఇంటి యజమాని మధ్య ఉన్న అద్దె ఒప్పందం వివరాలు వెల్లడించడం తప్పనిసరి. పాన్ వివరాలు కూడా ఇవ్వాలి.

ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతాలో 10 లక్షల కంటే విత్ డ్రా, డిపాజిట్‌ చేసినా పాన్‌ వివరాలు ఇవ్వాలి. ఇళ్లు, స్థలాల కొనుగోలు, అమ్మకం, బహుమతి లేదా ఉమ్మడి డెవలప్‌మెంట్‌ ఒప్పందాల విషయంలో లావాదేవీ విలువ 20లక్షలు దాటితే ఇకపై పాన్‌ తప్పనిసరి. ప్రస్తుతం ఈ పరిమితి 10 లక్షలుగా ఉంది. ద్విచక్ర వాహనం సహా ఏ మోటారు వాహనమైనా, దాని ధర 5 లక్షలు మించితే కొనుగోలుదారుడు పాన్‌ సమర్పించాల్సి ఉంటుంది. పాత చట్టంలో ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన లేదు. హోటళ్లు లేదా రెస్టారెంట్ల బిల్లులు, కన్వెన్షన్‌ సెంటర్లు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకు చేసే చెల్లింపులు లక్ష దాటితే ఇకపై పాన్‌ సమర్పించాలి.

ప్రస్తుతం హోటల్‌, రెస్టారంట్‌ బిల్లు 50 వేలు దాటితే పాన్‌ ఇవ్వాల్సి వస్తోంది. గతంలో పాన్‌ కార్డు పొందాలంటే ఆధార్‌ సమర్పిస్తే సరిపోయేది. ఇకపై ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌, బర్త్‌ సర్టిఫికెట్ వంటి అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ సింప్లీ క్లిక్‌ క్రెడిట్‌ కార్డు, ఎయిర్​ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినమ్‌ కార్డు, ఎయిరిండియా ఎస్‌బీఐ సిగ్నేచర్‌ కార్డులు కలిగిన వారికి రివార్డుల్లో కోత ఉంటుంది. స్విగ్గీ, ఎయిరిండియా టికెట్‌ బుకింగ్‌లపై లభించే రివార్డులనూ ఎస్‌బీఐ కుదించింది. ఇన్‌యాక్టివ్‌ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్‌ నంబర్లకు నేటి నుంచి యూపీఐ సేవలు పనిచేయవు. యూపీఐ లైట్‌ వ్యాలెట్‌లో మనం లోడ్‌ చేసుకున్న డబ్బులను బ్యాంకు ఖాతాకు పంపుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

ఫ్యూచర్స్‌పై సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను 0.02 శాతం నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్‌ ప్రీమియం, ఆప్షన్స్‌పై ఎస్‌టీటీ 0.01 శాతం నుంచి వరుసగా 0.15శాతం, 0.125 శాతానికి పెంచుతూ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఎఫ్‌అండ్‌ఓ ట్రేడర్లపై ఈ ప్రభావం పడనుంది. ప్రస్తుతం బీమా పాలసీ కొనుగోలు సమయంలో వార్షిక ప్రీమియం రూ.50వేలు దాటితేనే పాన్‌ అడుగుతున్నారు. ఇకపై ప్రతి పాలసీకి పాన్‌ సమర్పించడం తప్పనిసరి. బ్యాంకు డిపాజిట్లపై విధించే మూలం వద్ద పన్ను పరిమితి పెరిగింది. ఇప్పటిదాకా బ్యాంకు డిపాజిట్లపై 50వేలకు మించి వార్షిక వడ్డీని పొందే సీనియర్ సిటిజెన్లపై టీడీఎస్ విధించేవారు.

నేటి నుంచి ఈ పరిమితి 1 లక్ష. ఇప్పటిదాకా బ్యాంకు డిపాజిట్లపై 40వేలకు మించి వార్షిక వడ్డీని పొందే సాధారణ పౌరులపై టీడీఎస్ విధించేవారు. ఇక నుంచి ఈ పరిమితి 50వేలకు పెంచారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అంటే లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ కింద విదేశీ చెల్లింపులు 7 లక్షలు దాటితే టీసీఎస్‌ విధించేవారు. ఈ పరిమితి రూ.10 లక్షలకు పెంచారు. బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకొని, ఆ డబ్బులను విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై టీసీఎస్‌ విధించరు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ యాన్యువల్ ఫీజులను పెంచింది. రహదారుల ఫీజు నిబంధనలు, 2008కి అనుగుణంగా వార్షిక రుసుమును పెంచింది. ఫాస్టాగ్ యాన్యువల్ ఫీజు కోసం 3075 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 3000 ఉండేది. దీనికి అదనంగా 75 చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు 195 రూపాయల 50 పైసల మేర పెంచాయి. సిలిండర్ల ధరల పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు వంటి కమర్షియల్ రంగంపై ప్రభావం చూపుతోంది. గృహ వినియోగదారులకు మాత్రం తాత్కాలికంగా ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర మార్చి 7న 60 పెరిగి, 913కు చేరింది. అటు విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో కిలోలీటర్‌ విమాన ఇంధనం ధర రూ. 2.07 లక్షలకు చేరుకుంది. గత నెలలో ATF కిలోలీటర్‌కు రూ.96,638 ఉండగా, ఏప్రిల్‌ నెలకు సంబంధించి చమురు సంస్థలు ధరలను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

ఏటీఎఫ్‌ పెంపుతో విమానయాన సంస్థలు భారీగా టికెట్‌ ధరలను పెంచే అవకాశం ఉంది. రైల్వే టికెట్‌కు సంబంధించిన క్యాన్సిలేషన్‌ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. ఇంతకుముందు 4 గంటులుగా ఉండేది. అలాగే రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు నుంచి ఎనిమిది గంటల మధ్య ఎప్పుడైనా టికెట్టును రద్దు చేసుకుంటే 50%, 72-24 గంటల మధ్య టికెట్లు రద్దు చేసుకుంటే 25% మొత్తాన్ని మినహాయించుకుని...మిగిలిన మొత్తాన్ని ఇచ్చేస్తారు. రైలు బయల్దేరడానికి కనీసం 72 గంటల సమయం ఉండగా టికెట్లను ఎప్పుడు రద్దు చేసుకున్నా క్యాన్సిలేషన్‌ రుసుములు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని వాపసు చేస్తారు.

Published : 
  • 2 April 2026, 12:10 PM IST