దేశీయ మార్కెట్లో పసిడి, వెండి వెలుగులకు కేంద్రం బ్రేకులు వేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండి, ప్లాటినం వస్తువులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లను అడ్డుపెట్టుకొని జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టడమే లక్ష్యం పావులు కదుపుతోంది.బంగారం, వెండి, ప్లాటినం వంటి అన్ని రకాల వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైనా ముందస్తు ఒప్పందం లేదా రద్దు చేయలేని లెటర్ ఆఫ్ క్రెడిట్, ముందస్తు చెల్లింపులతో సంబంధం లేకుండా...ఈ పరిమితులు వర్తిస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ స్పష్టం చేసింది. బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు ప్రకటించింది. దీంతో ఇప్పుడు అన్ని రకాల బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల దిగుమతులపై నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
కొంతమంది దిగుమతిదారులు భారత్-ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. దీంతో నిజమైన వ్యాపారులు నష్టపోకుండా ఉండేందుకు, లైసెన్సింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని నిర్ణయించింది. కొందరు వ్యాపారులు సుంకాల వ్యత్యాసాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టారిఫ్‌లను తప్పించుకోవడం ద్వారా స్వల్పకాలంలోనే భారీగా డబ్బు సంపాదించడానికి FTAని వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు.కేవలం ముడి బంగారం, వెండి మాత్రమే కాకుండా ప్లాటినం, ముత్యాలు, విలువైన రాళ్లు, ఇమిటేషన్ జ్యువెలరీ , నాణేలపై కూడా ఈ పరిమితులు వర్తిస్తాయి. ఇప్పటివరకు ఏవైనా ముందస్తు ఒప్పందాలు చేసుకున్నా, పేమెంట్లు చేసినా, లేదా షిప్‌మెంట్ తయారీలో ఉన్నా సరే.. ఈ కొత్త రూల్స్ నుంచి మినహాయింపు ఉండదని ప్రభుత్వం ఖరాకండిగా చెప్పేసింది. అంటే, ఇకపై ఈ వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక లైసెన్సు లేదా అనుమతి తప్పనిసరి. భారత్‌కు ఆగ్నేయాసియా దేశాల కూటమితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి కొంతమంది వ్యాపారులు తక్కువ పన్నుతో బంగారం, వెండి వస్తువులను భారత్‌కు తీసుకొస్తున్నారు.
ముఖ్యంగా ఎటువంటి రాళ్లు పొదగని సాధారణ నగలను దిగుమతి చేసుకుంటూ, పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అక్రమ మార్గాలకు అడ్డుకట్ట వేసి, దేశీయ పరిశ్రమను కాపాడటానికి ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబర్‌లో ప్లాటినంపై, సెప్టెంబర్‌లో వెండిపై విడివిడిగా ఆంక్షలు విధించిన ప్రభుత్వం, ఇప్పుడు అన్ని రకాల విలువైన లోహాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి నియంత్రణలోకి తెచ్చింది.కేంద్రం నిర్ణయంతో మార్కెట్‌లో బంగారం , వెండి సరఫరాపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉంది. సరఫరా తగ్గితే ధరలు పెరిగే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం లైసెన్సింగ్ ప్రక్రియను సులభతరం చేస్తే, నిజాయితీగా వ్యాపారం చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. విదేశాల నుంచి చౌకగా దిగుమతి అయ్యే నాణ్యత లేని నగల కంటే, దేశీయంగా తయారయ్యే ఆభరణాలకు ఈ నిర్ణయం వల్ల ఊతం లభించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే దిగుమతి అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... భవిష్యత్తులో పసిడి మార్కెట్‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.
-