ఆఫ్ఘనిస్థాన్ తో ఏకైక టెస్ట్… సీనియర్లకు రెస్ట్…!

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కోసం టీమిండియా ఎంపికను భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే పరిశీలిస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 22 April 2026, 10:50 AM IST

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కోసం టీమిండియా ఎంపికను భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే పరిశీలిస్తున్నారు. జూన్‌ 6 నుంచి న్యూ చంఢీఘడ్‌లో జరుగబోయే ఈ మ్యాచ్‌ కోసం సీనియర్లకు విశ్రాంతినివ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. సీనియర్ల జాబితాలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాకపోవడంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. అదే సమయంలో వర్క్‌లోడ్‌ మేనేజ్ మెంట్ లో భాగంగా సీనియర్లకు విశ్రాంతినిచ్చే ఉద్దేశం మరో కారణంగా చెబుతున్నారు.

భారత పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్‌ టెస్ట్‌ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆతర్వాత భారత జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఐర్లాండ్‌కు వెళ్లనుంది. అనంతరం 5 టీ20లు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌కు వెళుతుంది.. ఇంగ్లండ్‌ సిరీస్‌ నేపథ్యంలో భారత సెలెక్టర్లు గిల్‌, బుమ్రాకు విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నారు.టీమిండియా-ఇంగ్లండ్‌ సిరీస్‌ జులై 1 నుంచి ప్రారంభమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌, ఐర్లాండ్‌ సిరీస్‌లకు గిల్‌, బుమ్రాకు విశ్రాంతినివ్వడానికి సెలెక్టర్ల వద్ద మరో కారణం కూడా ఉంది.

2027 వన్డే వరల్డ్‌కప్‌కు వీరిద్దరు కీలకం కాబటి, మెగా టోర్నీకి ముందు వీలైనంత విశ్రాంతినివ్వవచ్చు. గిల్‌, బుమ్రా ఇటీవల తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు వీరి విషయంలో రిస్క్‌ తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ ప్రపంచకప్‌ దృష్ట్యా వన్డేల్లో ఆడించాలని అనుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌కు ఎంపిక చేయవచ్చు. బుమ్రా, గిల్‌ గైర్హాజరీలో పలువురు యువ ఆటగాళ్ళకు చోటు దక్కనుంది. దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో రాణిస్తున్న యువ క్రికెటర్ల పేర్లు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఆకిబ్‌ నబీ, దేవదత్‌ పడిక్కల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి , ప్రియాన్ష్ ఆర్య, వంటి యువ ఆటగాళ్లలో కొందరికి ఛాన్స్ ఇవ్వనున్నారు.

Published : 
  • 22 April 2026, 10:50 AM IST