నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకవైపు కమర్షియల్ సినిమాలతో అలరిస్తూనే, మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మిక నటిస్తున్న తాజా చిత్రం ‘మైసా’. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాలో రష్మిక కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో మెరవనున్నారు. దీని కోసం ఆమె ఎంతో శ్రమిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని స్టంట్స్ కోసం రష్మిక కొన్ని రోజుల క్రితమే బ్యాంకాక్ వెళ్లారు. అక్కడ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో ప్రత్యేకమైన యుద్ధ విద్యలు, స్టంట్స్ మరియు పోరాట మెళకువలను నేర్చుకున్నారు. కేవలం నేర్చుకోవడమే కాదు, వాటిని ఇప్పుడు తెరపై అద్భుతంగా పండించడానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ కేరళలోని దట్టమైన అడవుల్లో జరుగుతోంది. అడవి నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా నేతృత్వంలో సుమారు 15 రోజుల పాటు ఈ పోరాట ఘట్టాలను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవి సినిమాలోనే అత్యంత కీలకమైన మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశాలుగా నిలుస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మైసా' చిత్రంలో రష్మిక ఒక గొండు గిరిజన యువతి పాత్రలో కనిపిస్తున్నారు. ఒక గిరిజన యువతి తన ఉనికి కోసం, తన జాతి కోసం చేసే పోరాటం ఈ సినిమాలో ప్రధానాంశంగా ఉండబోతున్నట్లు సమాచారం.
రష్మిక లుక్ మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ ఈ పాత్ర కోసం పూర్తిగా మారిపోయాయని, ఆమె నటనలో ఒక కొత్త తీవ్రత ఈ సినిమాలో కనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'అన్ స్టాపబుల్ ఫిల్మ్స్' సంస్థ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సాధారణంగా రష్మిక అంటే మనకు 'శ్రీవల్లి' లాంటి సాఫ్ట్ పాత్రలు గుర్తుకు వస్తాయి, కానీ 'మైసా'తో ఆమె ఒక పూర్తి స్థాయి యాక్షన్ హీరోయిన్గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు.కేరళ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం చెబుతోంది. రష్మిక పడ్డ కష్టం, ఆండి లాంగ్ శిక్షణ, కేచా యాక్షన్ కంపోజిషన్ వెరసి.. 'మైసా' బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.