తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే సరికొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. వెండితెరపై ‘దళపతి’గా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటుతున్నారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ అనూహ్యమైన రీతిలో దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో తమిళనాట రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.మే 4వ తేదీన నటి త్రిష పుట్టినరోజు కావడం, సరిగ్గా అదే రోజు ఎన్నికల ఫలితాలు రావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె, తన చిరకాల కోరిక నెరవేరాలని మొక్కుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ ముఖ్యమంత్రి కావాలన్నది తన కోరిక అని త్రిష గతంలోనే అనేక సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు విజయ్ విజయపథంలో పయనిస్తుండటంతో, ఆమె మొక్కులు ఫలించాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఒక ఆసక్తికరమైన ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. త్రిషను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
"ఆ తిరుమల వేంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది... కంగ్రాట్స్ త్రిష" అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు.
విజయ్ గెలుపుతో పాటు త్రిష రాజకీయ ఆకాంక్షలను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. త్రిష కేవలం విజయ్‌కు మద్దతు తెలపడమే కాకుండా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ ట్వీట్ ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.దాదాపు 15 ఏళ్ల క్రితం ఒక మీడియా ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయ్ పార్టీలో త్రిష కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, బహుశా ఆమెకు పార్టీలో ముఖ్యమైన పదవి దక్కవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. "విజయ్ విజయం కోసమే ఆమె తిరుమలకు వెళ్లారా?" అంటూ నెటిజన్లు సరదాగా చర్చించుకుంటున్నారు.
విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు చాలామంది పెదవి విరిచారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆయన చేసిన పర్యటనలు, యువతలో ఆయనకున్న ఫాలోయింగ్ ఇప్పుడు ఓట్లుగా మారుతున్నాయి. విజయ్ పార్టీకి యువ ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెడుతూ ప్రజలు టీవీకే వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. విజయ్ క్రేజ్‌కు తోడు త్రిష వంటి స్టార్స్ మద్దతు కూడా పార్టీకి ప్లస్ అయినట్లు తెలుస్తోంది. విజయ్ ఇంటి వద్ద ఇప్పటికే కోలాహలం మొదలైంది. భారీగా తరలివస్తున్న అభిమానుల దృష్ట్యా భద్రతను కూడా పెంచారు. ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తే, త్రిష ఆ పార్టీలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. త్రిష పుట్టినరోజున ఆమె అభిమానులకు ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది? విజయ్ 'విజయయాత్ర'లో త్రిష తోడుగా నిలవడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.తమిళనాట మొదలైన ఈ సరికొత్త రాజకీయ విప్లవం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.