టాలీవుడ్ 'మాచో స్టార్' గోపీచంద్ మళ్ళీ ఫుల్ స్పీడు పెంచేశారు. ఒకప్పుడు విలన్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. ప్రస్తుతం గెలుపు గుర్రం ఎక్కేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ విలక్షణమైన దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కలిసి 'భరతవర్ష' అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. 'ఘాజీ', 'అంతరిక్షం' వంటి ప్రయోగాత్మక చిత్రాలతో తన సత్తా చాటుకున్న సంకల్ప్ రెడ్డి, ఈసారి గోపీచంద్‌ని సరికొత్త కోణంలో చూపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన కొన్ని విజువల్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో గోపీచంద్ లుక్ పూర్తిగా మారిపోయింది. ఆయన మేకోవర్ చూస్తుంటే ఈ సినిమాతో పక్కాగా హిట్ కొట్టేలా ఉన్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనితో పాటు, మరో కొత్త దర్శకుడు కుమార్ సాయి దర్శకత్వంలో ఒక భారీ చిత్రానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ అత్యధిక భాగం విదేశాల్లో జరగనుండటం విశేషం. కథా పరంగా ఇది ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలో, గోపీచంద్ లైనప్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. ప్రముఖ స్టంట్ మాస్టర్ వెంకట్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. యాక్షన్ సినిమాలకి తన ఫైట్ కంపోజిషన్‌తో ప్రాణం పోసే వెంకట్, గోపీచంద్ వంటి యాక్షన్ హీరోని ఎలా హ్యాండిల్ చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మే 3వ తేదీన హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్రం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కానప్పటికీ, ఇదొక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది.
నిజానికి, గత కొంతకాలంగా గోపీచంద్‌కు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. 'యజ్ఞం', 'లక్ష్యం', 'శౌర్యం' వంటి హిట్లతో ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని యాక్షన్ హీరోగా ఎదిగిన గోపి, ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో కాస్త వెనుకబడ్డారు. అయితే, ఆయనలోని పట్టుదల ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే, తదుపరి సినిమాల్లో పాల్గొనడానికి ఆయన సిద్ధమవుతున్నారు. వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న గోపీచంద్, ఈసారి గెలుపు మీద చాలా ధీమాగా ఉన్నారు. అటు అనుభవజ్ఞులైన నిర్మాతలు, ఇటు వైవిధ్యమైన దర్శకులతో ఆయన చేస్తున్న ఈ ప్రయోగాలు సక్సెస్ కావాలని మాచో స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు.