ఈ 21వ శతాబ్దంలో ప్రపంచం మొత్తం టెక్నాలజీ, సమాన హక్కుల గురించి మాట్లాడుతుంటే.. ఒక దేశం మాత్రం మహిళలను పాతరాళంలోకి నెట్టేస్తోంది. అవును.. ఆఫ్ఘనిస్తాన్‌ను పాలిస్తున్న తాలిబాన్ ప్రభుత్వం మహిళల హక్కులను పూర్తిగా సమాధి చేస్తూ మరొక విచిత్రమైన, అత్యంత వివాదాస్పదమైన చట్టాన్ని తీసుకువచ్చింది. "ఒక అమ్మాయి పెళ్లి విషయంలో మౌనంగా ఉంటే.. ఆమె ఆ పెళ్లికి అంగీకరించినట్లే లెక్క". ఇదీ తాలిబాన్లు పాస్ చేసిన కొత్త రూల్. వినడానికే షాకింగ్‌గా ఉన్న ఈ చట్టం వెనుక అసలు కథ ఏంటి..? మైనర్ పిల్లల పెళ్లిళ్లపై తాలిబాన్ సుప్రీం లీడర్ ఇచ్చిన ఆదేశాలు ఎలాంటివి? ఈ అనాగరిక చట్టంపై ప్రపంచ దేశాలు ఎందుకు మండిపడుతున్నాయి?ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాలపై తమదైన శైలిలో వివరణ ఇస్తూ.. తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా "ప్రిన్సిపల్స్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ స్పౌసెస్” అంటే.. భార్యాభర్తల విడిపోవడానికి సంబంధించిన సూత్రాలు పేరుతో 31 ఆర్టికల్స్ ఉన్న ఒక కొత్త డిక్రీని అంటే ఆర్డినెన్స్ ను ఆమోదించారు. ఇది అక్కడ అధికారికంగా చట్టంగా మారింది. ఈ చట్టంలో పొందుపరిచిన కొన్ని నిబంధనలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దాని ప్రకారం.. ఒక పెళ్లికాని అమ్మాయి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటే, ఆ మౌనాన్ని ఆమె సమ్మతిగా భావించి పెళ్లి జరిపించవచ్చు.
కానీ, ఇదే నిబంధన అబ్బాయిలకు లేదా ఒకసారి పెళ్లయిన మహిళలకు వర్తించదు. వారి నోటి నుండి స్పష్టమైన సమాధానం వస్తేనే పెళ్లి చేయాలి. అంటే మహిళల నోరు నొక్కేయడానికే ఈ చట్టం తెచ్చారని స్పష్టమవుతోంది. ఈ చట్టం ఇంతటితో ఆగలేదు.. బాల్య వివాహాలను కూడా ఇది కొన్ని షరతులతో సమర్థిస్తోంది. తండ్రి లేదా తాతలు నిర్ణయిస్తే.. మైనర్ అబ్బాయిలు, అమ్మాయిల పెళ్లిళ్లను చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేలా ఈ నిబంధనలు అనుమతిస్తున్నాయి. అయితే, ఇందులో 'ఖియార్ అల్-బులూగ్' అంటే.. ఆప్షన్ ఆఫ్ పుబెర్టీ అనే ఒక రూల్ ఉంది.దీని ప్రకారం మైనర్ వయసులో పెళ్లి జరిగిన పిల్లలు, తాము పెద్దయ్యాక ఆ పెళ్లి వద్దు అనుకుంటే రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఆ పెళ్లిని రద్దు చేయాలన్నా కూడా మళ్లీ అక్కడ ఉండే తాలిబాన్ మతపరమైన కోర్టుల అనుమతి తప్పనిసరి. అలాగే వ్యభిచారం, మత మార్పిడి, భర్తలు ఎక్కువ కాలం కనిపించకుండా పోవడం వంటి గృహ వివాదాలన్నింటిలోనూ తాలిబాన్ జడ్జీలదే అంతిమ నిర్ణయం. వారు జైలు శిక్ష లేదా శారీరక శిక్షలు కూడా విధించవచ్చు.
2021 ఆగస్టులో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుండి మహిళలపై ఆంక్షలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఆరో తరగతి దాటిన అమ్మాయిలు స్కూళ్లకు వెళ్లడానికి వీల్లేదు. మహిళలు యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వీల్లేదు. వారు ఉద్యోగాలు చేయకూడదు, ఒంటరిగా ప్రయాణాలు చేయకూడదు, కనీసం పార్కులకు కూడా వెళ్లకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెచ్చిన ఈ కొత్త పెళ్లి చట్టం మహిళల స్వేచ్ఛను పూర్తిగా హరించి వేస్తోందని ఐక్యరాజ్యసమితి మరియు మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.భయంతోనో, సమాజానికి భయపడో అమ్మాయిలు నోరు విప్పకపోతే.. దానిని పెళ్లికి అంగీకారంగా ఎలా చూస్తారని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చట్టాలు అనేవి ప్రజలకు రక్షణ ఇవ్వాలి.. కానీ ఇలా జీవించే హక్కును, సొంత నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను లాగేసుకుంటే అది చట్టం అనిపించుకోదు, కేవలం బానిసత్వమే అవుతుంది.