టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని గురించి మనందరికీ తెలిసిందే. స్క్రీన్‌పై ఆయన ఎనర్జీ, డ్యాన్స్, యాక్టింగ్ లెవల్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు కేవలం నటుడిగానే మనల్ని అలరించిన రామ్.. ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ.. ఆయన ఒక మెగా నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా హీరోలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తుంటారు. కానీ రామ్ పోతినేని మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా మెగాఫోన్ పట్టబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే! రామ్ పోతినేని ఇటీవల ఒక సరికొత్త కబురును పంచుకున్నారు. ఆయన తన 23వ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ డైరెక్టర్ల విజన్ కి అనుగుణంగా నటించి మెప్పించిన రామ్.. ఇప్పుడు తన లోపలి దర్శకుడిని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రామ్ కేవలం దర్శకత్వం వహించడమే కాదు, ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథను సిద్ధం చేసుకున్నారు. అంటే రైటర్ కమ్ డైరెక్టర్‌గా రామ్ డబుల్ రోల్ పోషించబోతున్నారన్నమాట.ఇక జానర్ విషయానికి వస్తే.. ఇదొక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకోనుంది. రామ్ ఇప్పటివరకు మాస్ యాక్షన్, లవ్ స్టోరీస్ ఎన్నో చేశారు. కానీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను ఆయనే రాసుకుని డైరెక్ట్ చేయడం అనేది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రామ్ 'వీరా' అనే సరికొత్త పవర్‌ఫుల్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సినిమాలోని కథానాయిక ఎంపికపై పూర్తి దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో రామ్‌కు జోడీగా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. శ్రీనిధి శెట్టి తన నటనతో, గ్లామర్‌తో సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో రామ్, శ్రీనిధి జోడీ కడితే స్క్రీన్ పై కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతం దీనిపై ఆమెతో చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే ఈ విషయంలో అధికారికంగా స్పష్టత రానుందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కబోతోంది? ఎప్పుడు రిలీజ్ కానుంది? అనే విషయాలపై కూడా క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ జూన్ నెల నుంచే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది.షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి, ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ ఏడాది చివర్లోనే ప్రేక్షకులకు అందించాలని రామ్ ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
తన 23వ చిత్రంతో డైరెక్టర్‌గా మారి, తనే కథ అందిస్తూ, 'వీరా'గా నటిస్తూ రామ్ చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం టాలీవుడ్‌లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయితే సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయం అని సినీ క్రిటిక్స్ అంచనావేస్తున్నారు.