ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే నియోజకవర్గం ఏది అంటే.. ఎవరైనా టక్కున చెప్పే పేరు 'గన్నవరం'. అవును, కృష్ణా జిల్లాలోని ఈ కీలక నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు ఒకెత్తు.. ఇప్పటి పరిణామాలు ఒకెత్తు అన్నట్లుగా తయారైంది అక్కడి పరిస్థితి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ లీడర్ వల్లభనేని వంశీ మోహన్ జైలు నుంచి విడుదలైన తర్వాత నియోజకవర్గంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు.
ఈ ఒక్క పరిణామం అధికార కూటమిలో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో పెద్ద కలకలాన్నే రేపుతోంది. అసలు గన్నవరంలో ఏం జరుగుతోంది..? వంశీ రాకతో టీడీపీకి ఎదురవుతున్న ఇబ్బందులేంటి..? జైలు జీవితం వంశీకి సానుభూతిగా మారిందా..? ఈ వీడియోలో చూద్దాం. గత కొన్నాళ్లుగా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న వల్లభనేని వంశీ, బెయిల్ పై విడుదలయ్యాక మళ్లీ గన్నవరం పాలిటిక్స్ ను తన చేతుల్లోకి తీసుకునేందుకు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు.
గతంలో ఆయనపై ఏకంగా 11 కేసులు నమోదు కావడం, దాదాపు 137 రోజుల పాటు విజయవాడ జిల్లా జైలులోనే ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అయితే, ఈ సుదీర్ఘ జైలు జీవితం వంశీ వ్యక్తిగత జీవితాన్ని, ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. జైల్లో ఉన్న సమయంలో ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడ్డారు. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిన తరుణంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆరోగ్యం క్షీణించడం వంటి వార్తలు అప్పట్లో ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేశాయి.
అయితే, ఆరోగ్యం కాస్త కుదుటపడటమే ఆలస్యం.. వంశీ మళ్లీ గన్నవరం వైపు అడుగులు వేశారు. వంశీ తిరిగి నియోజకవర్గానికి వస్తున్నారనే సమాచారంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ మనం గన్నవరం నియోజకవర్గం యొక్క రాజకీయ నేపథ్యాన్ని ఒక్కసారి పరిశీలించాల్సి ఉంది. గన్నవరం అంటే కేవలం ఒక నియోజకవర్గం కాదు.. అది తెలుగుదేశం పార్టీకి ఒక నమ్మకమైన కోట, పెట్టని కోట. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా ఏడు సార్లు సైకిల్ జెండా ఇక్కడ ఎగిరింది.
అంతేకాదు, మరో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నిలబడిన స్వతంత్ర అభ్యర్థులే ఇక్కడ జయకేతనం ఎగరవేశారు. ముఖ్యంగా చెప్పాలంటే, 2009 ఎన్నికల నుంచి మొన్నటి 2024 ఎన్నికల వరకు వరసగా నాలుగు సార్లు ఇక్కడ గెలిచింది టీడీపీయే. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2014, 2019 ఎన్నికల్లో ఇదే వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అంటే గన్నవరంలో టీడీపీ బలం ఎంతో, వంశీకి ఉన్న వ్యక్తిగత క్యాడర్ బలం ఎంతో మనకు అర్థమవుతుంది.
అయితే 2019 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా మారిపోయారు. ఆ సమయంలో టీడీపీకి వంశీ తీవ్ర తలనొప్పిగా మారారు. కట్ చేస్తే.. 2024 ఎన్నికల్లో వల్లభనేని వంశీ నేరుగా వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా వీచిన కూటమి గాలి, దానికి తోడు టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పక్కా వ్యూహంతో వంశీకి గట్టి షాక్ తగిలింది.
ఆ ఎన్నికల్లో యార్లగడ్డ చేతిలో వంశీ ఓటమి పాలయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీపై పాత వ్యాఖ్యలు, వివాదాలు, గొడవల నేపథ్యంలో వరుసగా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కలిసి ఆయనను జైలు పాలు చేశాయి. కానీ, ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. వంశీ జైలు నుంచి బయటకు వచ్చి నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో అక్కడ సరికొత్త సానుభూతి పవనాలు వీస్తున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. దాదాపు ఐదు నెలల పాటు జైల్లో ఉండటం, పైగా తీవ్రమైన అనారోగ్యానికి గురికావడం వంటి అంశాలు ప్రజల్లో వంశీపై కొంత సానుభూతిని పెంచాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
దీనికి తోడు, ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై నియోజకవర్గంలో స్థానికంగా కొంత వ్యతిరేకత మొదలైందనే ప్రచారం కూడా వంశీకి కలిసి వస్తోంది. వంశీ గన్నవరం వచ్చినప్పుడల్లా సాధారణ ప్రజలతో పాటు ఆయన పాత అనుచరులు, వైసీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఒక కీలక గ్రూపు కూడా లోపాయకారీగా వల్లభనేని వంశీకి సపోర్ట్ చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది గనుక నిజమైతే అధికార పార్టీకి ఇది పెద్ద మైనస్ కానుంది.
రాబోయే రోజుల్లో ఇక్కడ వైసీపీ గెలుస్తుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం కానీ.. వంశీ ఎంట్రీతో గన్నవరంలో వైసీపీ పొజిషన్ గతంలో కంటే చాలా బెటర్ అయిందనేది మాత్రం వాస్తవం. ఇప్పటికైనా తెలుగుదేశం అధిష్టానం అలర్ట్ అయ్యి, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకోకపోతే.. భవిష్యత్తులో గన్నవరం కోటను కాపాడుకోవడం టీడీపీకి అంత ఈజీ కాదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.