ఆగని చిరు లీక్స్…!

మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక ప్రభంజనం, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటలో ఆయన రూటే సెపరేటు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం పట్టాలెక్కింది.

Post Published By: dialnews
Updated : 25 May 2026, 3:05 PM IST

మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక ప్రభంజనం, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటలో ఆయన రూటే సెపరేటు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం పట్టాలెక్కింది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ‘మెగా 158’ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరుణంలో, చిత్ర యూనిట్ అభిమానుల కోసం ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. స్పిరిట్ ఆఫ్ మెగా 158" పేరిట ఈ సినిమాకు పనిచేస్తున్న సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూసిన మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ ప్రత్యేక వీడియోలో అందరినీ అమితంగా ఆకట్టుకున్న అంశం ఏదైనా ఉందంటే.. అది మెగాస్టార్ చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ అనే చెప్పాలి. వీడియోలో సినిమా టైటిల్‌ను రివీల్ చేయబోతుండగా.. దర్శకుడు బాబీ ఆయనను అడ్డుకుంటారు. "సార్.. అప్పుడే టైటిల్ వద్దు సార్, సరైన సమయం చూసి చెప్దాం" అని బాబీ అనడం.. దానికి చిరంజీవి తనదైన స్టైల్‌లో స్పందించడం హైలైట్‌గా నిలిచింది.
బాబీ తనను ఆపలేడని, సరైన సమయం చూసి తానే స్వయంగా టైటిల్ లీక్ చేస్తానని చిరంజీవి సరదాగా అనడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో కూడా చిరంజీవి తన సినిమాల టైటిల్స్, స్టోరీ లైన్లను ఇంటర్వ్యూలలో లేదా ఈవెంట్లలో సరదాగా లీక్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇప్పుడు ఈ వీడియోలో కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ చిరు చేసిన హంగామా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో మెగాస్టార్‌ను వింటేజ్ లుక్‌లో చూపిస్తూ.. మాస్ ఎలిమెంట్స్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించిన దర్శకుడు బాబీ, ఈ సినిమాను అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ, టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె పాత్ర ఈ సినిమా కథలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని సమాచారం.ఇక ఈ చిత్రానికి టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సినిమాలకు థమన్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ చిత్రానికి కూడా ఆయన అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో "స్పిరిట్ ఆఫ్ మెగా 158" హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిసిన ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. మరి మెగాస్టార్ చెప్పినట్లు ఆ ‘టైటిల్ లీక్’ ఎప్పుడు వస్తుందో, అసలు ఆ టైటిల్ ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Published : 
  • 25 May 2026, 3:05 PM IST