మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. తనకు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు స్వయంగా అంగీకరించారు. ఈ రహస్యాలను అడ్డుపెట్టుకుని.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని బిల్ గేట్స్ ఆరోపించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ నెట్‌వర్క్, అతనితో సంబంధాలు ఉన్న ప్రముఖులపై అమెరికాకు చెందిన 'యూఎస్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీ' ప్రస్తుతం ముమ్మర విచారణ జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా జూన్ 10న బిల్ గేట్స్ స్వయంగా కమిటీ ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.
ఈ వాంగ్మూలంలోనే సంచలన విషయాలు చెప్పారు. రష్యాకు చెందిన బ్రిడ్జ్ క్రీడాకారిణి మిలా అంటోనోవా, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కరిమా నిగ్మాతులీనా, అలాగే మెడికల్ ఇండస్ట్రియలిస్ట్ అలిస్ జాకబ్స్ నెసెల్రోడ్‌తో తనకు వివాహేతర సంబంధాలు ఉన్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఈ మహిళలతో తనకు ఉన్న సంబంధాల గురించి జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ముందే పూర్తిగా తెలుసని విచారణ కమిటీకి వివరించారు. విచారణ కమిటీ విడుదల చేసిన వివరాల ప్రకారం బిల్ గేట్స్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “నేను చేసిన తప్పుల వల్ల నా కుటుంబం చాలా మానసిక క్షోభను అనుభవించింది.
ఈ ఎఫైర్లకు, ఎప్‌స్టీన్‌తో నేను మాట్లాడిన విషయాలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ, నా బలహీనతలను ఆసరాగా చేసుకుని, దానికి మరికొన్ని అబద్ధాలను కలిపి.. తనతో మళ్లీ సంబంధాలు కొనసాగించేలా ఎప్‌స్టీన్ నాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు” అని గేట్స్ పేర్కొన్నారు. అయితే, జెఫ్రీ ఎప్‌స్టీన్ చేసిన ఎలాంటి దారుణమైన నేరాల్లోనూ తనకు ఏమాత్రం భాగస్వామ్యం లేదని బిల్ గేట్స్ తేల్చి చెప్పారు. కేవలం సామాజిక సేవా కార్యక్రమాల గురించి చర్చించడానికే తాను ఎప్‌స్టీన్‌ను కలిసేవాడినని తెలిపారు. అతనొక నేరస్థుడని తెలిసినప్పటికీ, పరిమిత స్థాయిలోనైనా అతన్ని కలవడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్ తనను నేరుగా బ్లాక్‌మెయిల్ చేయకపోయినా, తన వ్యక్తిగత విషయాలను వాడుకుని బెదిరించాలని ప్లాన్ చేసినట్లు కొన్ని ఈమెయిల్స్ ద్వారా స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. ఈ సంచలన పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.