బంగారు నిల్వలను వివిధ దేశాలు ఎందుకు పెంచుకుంటున్నాయి ? ప్రపంచంలో ఏ దేశం వద్ద పుత్తడి నిల్వలు ఎక్కువగా ఉన్నాయి ? గోల్డ్ నిల్వల్లో భారత్ స్థానమెంత ? బంగారం నిల్వలు ఉంటే...ఆ దేశాల వద్ద ఫారెక్స్ నిల్వలు ఫుల్‌గా ఉన్నట్లేనా ? అందుకే ఆయా దేశాలు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయా ? ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది. పలు దేశాలు పోటీ పడి పుత్తడి నిల్వలను పెంచుకుంటున్నాయి. శతాబ్దాలుగా అనిశ్చితి తలెత్తినప్పుడు దేశాలు ఆశ్రయించే ఆస్తి బంగారం.
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు, అధునాతన ఆర్థిక మార్కెట్లు, క్రిప్టోకరెన్సీల ఆధిపత్యం ఉన్నప్పటికీ, ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు మరోసారి తమ పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. ఈ లోహం జాతీయ ఆర్థిక వ్యూహాలకు కేంద్రంగా నిలుస్తోంది. ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరత భౌగోళిక రాజకీయ ప్రమాదాలకు వ్యతిరేకంగా బంగారం ఒక వ్యూహాత్మక రక్షణ కవచంగా ఎలా పనిచేస్తుందో ఈ డేటా స్పష్టం చేస్తుంది. అతిపెద్ద నిల్వలు పశ్చిమ దేశాలలో కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు తమ నిల్వలను క్రమంగా పెంచుకుంటున్నాయి. ప్రపంచం బంగారు నిల్వల్లో 60% కంటే ఎక్కువ వాటా యునైటెడ్ స్టేట్స్, యూరప్‌ల వద్దే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్న గోల్డ్ నిల్వలపై...ఓ సంస్థ ర్యాంకింగ్ ప్రకటించింది. అగ్రరాజ్యం అమెరికా పుత్తడి నిల్వల్లో మరోసారి తన సత్తా చాటుకుంది. ఆ దేశం 8,133.5 టన్నుల బంగారంతో భారీ ఆధిక్యంతో ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇది జర్మనీ నిల్వల కంటే రెండింతలు ఎక్కువ. అంతేకాదు...జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌ల సంయుక్త నిల్వలకు అమెరికా వద్ద ఉన్న బంగారం సమానం. అమెరికా తర్వాత స్థానంలో జర్మనీ ఉంది. 3,351.6 టన్నులతో జర్మనీ రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత 2,451.9 టన్నులతో ఇటలీ, 2,437 టన్నులతో ఫ్రాన్స్ ఉన్నాయి. రష్యా, చైనాలు చెరో 2,200 టన్నులకు పైగా నిల్వలతో ఆరో స్థానంలో నిలిచాయి. 876.2 టన్నుల పసిడి నిల్వలతో భారత్ 8వ స్థానంలో నిలిచింది. ఇది అనేక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ ముందుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ రిజర్వ్ పోర్ట్‌ఫోలియోలను పటిష్టం చేయడానికి, సాంప్రదాయ రిజర్వ్ ఆస్తులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల కాలంలో భారత పసిడి నిల్వలు గణనీయంగా పెరిగాయి.
డ్రాగన్ కంట్రీ బంగారం సమీకరణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. 2019-2024 మధ్య ఆ దేశం 331 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. తన నిల్వలను దాదాపు 2,280 టన్నులకు పెంచుకుంది. పోలాండ్, టర్కీ కూడా గణనీయంగా పసిడిని పెంచుకున్నాయి. ఆర్థిక, భౌగోళిక రాజకీయ ఒడిదుడుకుల నుంచి రక్షణ కోరుకుంటున్న దేశాలు బంగారాన్ని కొంటున్నాయి. బంగారంపై ఆధిపత్యం ఇకపై అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకే పరిమితం కాదని ఈ ర్యాంకింగ్‌లు వెల్లడిస్తున్నాయి. ఉజ్బెకిస్తాన్, సౌదీ అరేబియా, కజకిస్తాన్, థాయిలాండ్, సింగపూర్ వంటి దేశాలు తమ నిల్వలను క్రమంగా విస్తరించుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే పలు దేశాలు పసిడిపై ప్రత్యేక దృష్టి సారించాయి. నిరంతర డిమాండ్ కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు...బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. అనిశ్చితి పెరిగినప్పుడు, బంగారంపై నమ్మకం చెక్కుచెదరదు. దేశాలు తమ ఆర్థిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటున్న కొద్దీ, వ్యూహాత్మక బంగారు నిల్వలను పెంచుకోవడంలో పోటీ ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు.