Top story : సామాన్యుడిపై పెట్రో బాంబ్ ఫ్యూచర్‌లో మరింత పైపైకి…!

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా పెంచాయి. లీటరు పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

Post Published By: dialnews
Updated : 16 May 2026, 7:00 PM IST

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా పెంచాయి. లీటరు పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఫ్యూచర్‌లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎఫెక్ట్‌ మిగిలిన అన్ని రంగాల పడనుంది.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చింది. దీనికి తోడు హర్మూజ్ జలసంధిలో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ధరలు మోత మొదలైంది. దేశంలో చమురు మోత మోగింది. ఒకేసారి 3 రూపాయలు పెరిగింది.

ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. యుద్ధ ప్రభావం పశ్చిమాసియా దేశాలపై పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రపంచ మార్కెట్లో పెరిగిపోతున్న ఇంధన రేట్లకు తగ్గట్లు దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ రిటైల్‌ ధరలను పెంచకపోవడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై లీటరుకు 14, డీజిల్‌పై 42 మేర నష్టం వస్తోంది. ప్రస్తుతం నెలకు 55,416 కోట్ల మేర అండర్‌ రికవరీలు ఉన్నాయి. ఈ నష్టాలను తగ్గించుకోవాలంటే...పెట్రోల్, డీజిల్‌ రేట్లను 20 శాతం మేర పెంచాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు లెక్కలు వేసుకున్నాయి. కనీసం 10 పెంచితే 17 వేల కోట్ల మేర నష్టం భర్తీ అవుతుంది. అయిల్ కంపెనీలను నష్టాల నుంచి తేరుకోవడానికి అనుగుణంగా...చమురు ధరలు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాను నిరంతరాయంగా కొనసాగుతోంది.

చమురు సంస్థలు రోజువారీ ధరల సవరణ విధానాన్ని 2022 ఏప్రిల్‌లో నిలిపివేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ వినియోగదారులపై భారం పడకుండా అప్పట్లో ధరలను స్థిరంగా ఉంచాయి. ఆ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అయితే తర్వాతి కాలంలో ముడి చమురు ధరలు తగ్గడంతో కొంతవరకు ఆ నష్టాలను భర్తీ చేసుకున్నాయి. తాజాగా చమురు ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపు మరింత ద్రవ్యోల్బణానికి దారి తీసే అవకాశం ఉంది. సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ధాన్యాలు, ఇతర అవసర వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి.

అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 50 శాతం వరకు పెరిగాయి. ఫిబ్రవరిలో భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ సగటు ధర బ్యారెల్‌కు 69 డాలర్లుగా ఉండగా, అనంతర నెలల్లో 120 డాలర్ల వరకు పెరిగింది. ఈ పరిస్థితుల్లో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అయింది. ముడిచమురు వల్ల అన్ని ధరలూ పెరిగితే... ద్రవ్యోల్బణానికి దారి తీసినట్లే. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు దాన్ని నియంత్రించడానికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించకుండా జాగ్రత్తపడుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే తదనుగుణంగా హోమ్‌ లోన్‌ ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంటుంది. పైపెచ్చు వ్యాపార రుణాలు ఖరీదవుతాయి. వినియోగం మందగిస్తుంది. ఇది మళ్లీ ఆర్థిక మందగమనానికి దారితీస్తుంది.

ధరల పెంపుపై సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగానికి చెందినవారిపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు...ఈ నిర్ణయం మరో ఆర్థిక భారం కానుంది. దేశానికి అవసరమైన ఎల్పీజీలో అత్యధిక భాగం దిగుమతుల ద్వారా వస్తున్నదే. సరఫరా ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ గ్యాస్‌ ధరలు పెరిగాయి. దీంతో ఇప్పటికే కమర్షియల్‌ సిలిండర్‌ ధరలను కేంద్రం ఏకంగా 30 శాతానికి పైగా పెంచేసింది. ఇళ్లలో వాడే సాధారణ సిలిండర్లు ఇప్పటికీ ఏజెన్సీల నుంచి సకాలంలో సరఫరా కావటం లేదు.

ఈ గ్యాస్‌ ఇబ్బందులతో.. ఇప్పటికే చాలా టిఫిన్‌ సెంటర్లతో సహా రెస్టారెంట్లు, హోటళ్లు ధరలను పెంచేశాయి. కేంద్ర ప్రభుత్వం చమురును డాలర్లలో కొంటుంది. క్రూడ్‌ ధర పెరిగితే ఎక్కువ డాలర్లు అవసరం అవుతాయి. అప్పుడు ఉన్న డాలర్లను వెచ్చించటంతో పాటు కొత్త డాలర్లు కొనాల్సి ఉంటుంది. డాలర్‌ను కొంటూ ఉంటే దాని విలువ పెరిగిపోతూ.. మనం వెచ్చించే రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు రూపాయి కనిష్ట స్థాయిలకు చేరటానికి ఇదే కారణం. చమురు ధరలు పెరిగితే ఎక్కువగా పెయింట్స్, సిమెంట్, కెమికల్స్, ఎయిర్‌లైన్స్, లాజిస్టిక్స్‌ రంగాలు దెబ్బతింటాయి. అయితే ఆయిల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కంపెనీలు, కొన్ని ఎగుమతి సంస్థలు లాభపడే అవకాశం ఉంది. కాకపోతే ఇలా లాభపడే సంస్థలతో పోలిస్తే ఇబ్బందిపడే సంస్థలే ఎక్కువ.

Published : 
  • 16 May 2026, 7:00 PM IST