టాలీవుడ్‌లో సీనియర్ హీరోల హవా ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో విక్టరీ వెంకటేష్ రూటే వేరు. అయితే, మారుతున్న కాలంతో పాటు సినిమా నిర్మాణ సమయం కూడా బాగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో సీనియర్ స్టార్ల నుంచి జూనియర్ స్టార్ హీరోల వరకు ఒక్కో సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కనీసం ఒకటి లేదా రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. ఒక సినిమా విడుదలైన తర్వాత మరో సినిమా పట్టాలెక్కడానికి చాలా నెలలు పడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో విక్టరీ వెంకటేష్ మాత్రం సరికొత్త రికార్డుకు తెరలేపనున్నారు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు ప్రధాన పండగ సీజన్లను టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కువ శాతం భారీ బడ్జెట్ మరియు క్రేజీ చిత్రాలు ఈ సీజన్లలోనే విడుదలవుతుంటాయి. పండగ సెలవులు కావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తుంటారు. అందుకే స్టార్ హీరోలందరూ తమ సినిమాలను ఈ సీజన్లలోనే విడుదల చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే, ఇటీవల కాలంలో ఒకే హీరో వరుసగా రెండు వేర్వేరు పండగ సీజన్లలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేయడం అనేది చాలా అరుదుగా మారింది. కానీ, వెంకటేష్ మాత్రం ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ.. వరుసగా రెండు ప్రధాన సీజన్లను లాక్ చేసుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్, టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఆదర్శ కుటుంబం' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరియు త్రివిక్రమ్ మార్క్ పదునైన సంభాషణలు, సెంటిమెంట్ కలగలిసి ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ క్రేజీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దసరా సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ 'ఆదర్శ కుటుంబం' థియేటర్లలో సందడి చేయనుంది. దసరా రేసులో 'ఆదర్శ కుటుంబం' చిత్రంతో దిగుతున్న వెంకీ మామ.. ఆ వెంటనే మరో భారీ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌తో సంక్రాంతి బరిలోకి కూడా దిగుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ మరో సినిమాలో నటిస్తున్నారు. ఇదివరకే వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'F2', 'F3', సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించి, భారీ వసూళ్లను సాధించాయి.
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అనిల్ రావిపూడి మార్క్ హిలేరియస్ కామెడీ, వెంకటేష్ టైమింగ్ కలగలిసిన ఈ చిత్రం సంక్రాంతి పండగ వేళ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో విక్టరీ వెంకటేష్ వరుసగా దసరా, సంక్రాంతి వంటి రెండు అతిపెద్ద ప్రధాన సీజన్లను టార్గెట్ చేసినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. తక్కువ వ్యవధిలోనే రెండు విభిన్నమైన సినిమాలతో, ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవ్వడం వెంకీ మామ వేగానికి, ప్లానింగ్‌కు అద్దం పడుతోంది.ఒకవైపు క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం', మరోవైపు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న అనిల్ రావిపూడి సినిమా.. ఈ రెండు చిత్రాలతో వెంకీ ఎలాంటి విజయాలను అందుకుంటారో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తారో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.