బ్యాంక్‌ అకౌంట్లు ఫ్రీజ్‌.. రావణ్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

యూట్యూబర్‌ ‘ప్రశ్న రావణ్’ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత నెల 28న ఏలూరులో జరిగిన ఓ సభలో పవన్ కళ్యాణ్ పై, ప్రభుత్వ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జనసేన నాయకులు రావణ్‌ మీద ఫిర్యాదు చేశారు.

Post Published By: dialnews
Updated : 10 July 2026, 5:03 PM IST

యూట్యూబర్‌ ‘ప్రశ్న రావణ్’ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత నెల 28న ఏలూరులో జరిగిన ఓ సభలో పవన్ కళ్యాణ్ పై, ప్రభుత్వ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జనసేన నాయకులు రావణ్‌ మీద ఫిర్యాదు చేశారు. మొదట జూలై 1న కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు రావణ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకోగా, ఆ రోజు రాత్రే మేజిస్ట్రేట్ అతనికి బెయిల్ మంజూరు చేశారు. అయితే, జూలై 2న సర్పవరం పోలీసులు మరో కేసులో అతన్ని మళ్లీ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, తన వీడియోల ద్వారా మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే తీవ్రమైన ఆరోపణలతో గన్నవరం పోలీసులు రావణ్‌పై ఏకంగా ‘ఉపా’ UAPA చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం అతను నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నాడు.

అరెస్ట్‌కు ముందే రావణ్ తన ఫోన్‌లోని డేటాను మొత్తం డిలీట్ చేసేశాడు. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ను అమరావతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిపుణులు రికవరీ చేసిన డేటాలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. రావణ్‌ డిలీట్ చేసిన వాటిలో పలువురు మహిళలతో ఉన్న వ్యక్తిగత, అభ్యంతరకరమైన వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ రాసలీలల వీడియోలను అడ్డుపెట్టుకుని ఆయా మహిళలను బ్లాక్‌మెయిల్ చేస్తూ లక్షల్లో డబ్బులు గుంజినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్సాప్ కాల్స్, చాట్ హిస్టరీని కూడా రికవరీ చేసే ప్రయత్నంలో పోలీసులున్నారు.

జోసెఫ్ రావణ్ చేతిలో మోసపోయి, బెదిరింపులకు గురైన మహిళలు నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కాకినాడ జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివాదాలు సృష్టిస్తూ వీడియోలు చేయడం వల్ల రావణ్ యూట్యూబ్ ఛానెల్‌కు వ్యూవర్స్ ఎక్కువే. దీనివల్ల గత కొద్ది నెలలుగా యూట్యూబ్ నుంచే అతనికి నెలకు సగటున లక్షన్నర వరకు ఆదాయం వస్తున్నట్లు అంచనా. యూట్యూబ్ ఆదాయంతో పాటు, బ్లాక్‌మెయిల్ ద్వారా కూడా లక్షల్లోనే వెనకేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు.. రావణ్‌కు చెందిన రెండు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. అయితే రావణ్‌ అరెస్ట్‌ను అటు వైసీపీతో పాటు కూటమి వ్యతిరేకులంతా విమర్శిస్తున్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక యూట్యూబర్‌ మీద ఇలా అనేక తీవ్రమైన నేరారోపణలు మోపడం ఇప్పుడు ఏపీవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Published : 
  • 10 July 2026, 5:03 PM IST