జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా చిత్రం అధికారికంగా ప్రకటించగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్ వివాదాల కేంద్రంగా మారింది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమా పోస్టర్, దానికి జత చేసిన ట్యాగ్‌లైన్‌పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీంతో "త్రివిక్రమ్ సినిమాకు ఇప్పటినుంచే అడ్డంకులు మొదలయ్యాయా?" అనే ప్రశ్న తారక్ అభినులను కలవరపెడుతోంది.
ఈ వివాదానికి కారణం పోస్టర్ మీద రాసిన వాక్యాలే. "Born in the North… Forged in the Heartland… Worshipped in the South…" అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించారు. ఈ వాక్యంలోని "Born in the North" అనే భాగం తమిళనాడులోని కొంతమంది భక్తులు, నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం చెప్పడానికి కారణమైంది. వారి అభిప్రాయం ప్రకారం మురుగన్ తమిళుల సంస్కృతిలో అత్యంత కీలకమైన దైవం. ఆయనను "తమిళ్ కడవుల్" అని కూడా పిలుస్తారు. అలాంటి దైవాన్ని "ఉత్తరంలో జన్మించాడు" అనే విధంగా పేర్కొనడం తమిళ సంప్రదాయాన్ని తప్పుగా చూపించడమేనని వారు ఆరోపించారు.ఈ అంశం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో రాజకీయ రంగు కూడా పులుముకుంది. నామ్ తమిళర్ కచ్చి నాయకుడు సీమాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తమిళుల గౌరవానికి సంబంధించిన చిహ్నాలతో ఆటలాడవద్దని హెచ్చరించారు. అవసరమైతే తమిళనాడులో సినిమా విడుదలను కూడా వ్యతిరేకిస్తామని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో వివాదం మరింత పెద్దదైంది.
విమర్శలు పెరగడంతో నిర్మాత మొదట ఉపయోగించిన ట్యాగ్‌లైన్‌ను తొలగించి, దాని స్థానంలో "The Son of Shiva. The Pride of Parvathi. The Eternal Commander." అనే కొత్త వివరణను ఉంచారు. అయితే అప్పటికే చర్చ దేశవ్యాప్తంగా విస్తరించింది. కొందరు ఇది అనవసర వివాదమని భావిస్తే, మరికొందరు మతపరమైన, సాంస్కృతిక అంశాల్లో అత్యంత జాగ్రత్త అవసరమని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వివాదం వల్ల సినిమా నిజంగానే ఇబ్బందుల్లో పడిందా అంటే, ప్రస్తుతం అలాంటి నిర్ధారణకు ఆధారాలు లేవు. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. చిత్రబృందం కథ గురించి కూడా అధికారిక వివరాలు వెల్లడించలేదు. పోస్టర్లో కనిపించిన సంకేతాల ఆధారంగా ఇది మురుగన్ లేదా ఆయనకు సంబంధించిన పురాణ అంశాలతో ముడిపడి ఉండొచ్చని మాత్రమే ప్రచారం జరుగుతోంది. అధికారిక కథ బయటకు వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది.
మొత్తానికి, త్రివిక్రమ్–ఎన్టీఆర్ సినిమా ప్రారంభానికి ముందే భారీ చర్చలో నిలిచింది. ఈ పోస్టర్ వ్యాఖ్యలు నిజంగా పెద్ద అడ్డంకిగా మారుతుందా, లేక విడుదల సమయానికి అంతా సద్దుమణుగుతుందా అన్నది రాబోయే రోజుల్లోనే తేలనుంది.