కడుపు కట్టేసుకుని కసరత్తులు.. జయహో.. తారక్..!

డ్రాగన్' సినిమా టీజర్ విడుదలైన తర్వాత ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం కథ కాదు... జూనియర్ ఎన్టీఆర్ లుక్. గత సినిమాల్లో కాస్త బలంగా కనిపించిన ఎన్టీఆర్, ఈసారి చాలా సన్నగా, షార్ప్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

Post Published By: dialnews
Updated : 10 July 2026, 7:50 PM IST

'డ్రాగన్' సినిమా టీజర్ విడుదలైన తర్వాత ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం కథ కాదు... జూనియర్ ఎన్టీఆర్ లుక్. గత సినిమాల్లో కాస్త బలంగా కనిపించిన ఎన్టీఆర్, ఈసారి చాలా సన్నగా, షార్ప్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ మార్పు ఎలా సాధ్యమైందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన వివరాల ప్రకారం, సినిమాలో ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్రకు తగ్గట్టుగా మరింత స్లిమ్‌గా ఉంటే బాగుంటుందని సూచించగా, ఎన్టీఆర్ దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దాదాపు నాలుగు నెలల పాటు ఇతర షూటింగ్‌లను పక్కన పెట్టి పూర్తిగా ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సుమారు 15 కిలోల బరువు తగ్గారు.

ఆయన ఫిట్‌నెస్ టీమ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది ఒక్కసారిగా జరిగిన మార్పు కాదు. ప్రతిరోజూ 45 నుంచి 90 నిమిషాల వరకు కార్డియో, ఫంక్షనల్ ట్రైనింగ్, తేలికపాటి వెయిట్ ట్రైనింగ్ చేశారు. శరీరంలోని కండరాలు మరీ ఎక్కువగా కనిపించకుండా, పాత్రకు సరిపోయే లీన్ ఫిజిక్ కోసం ప్రత్యేక వ్యాయామాలు చేశారు. ఆహారంలో కూడా కఠిన నియమాలు పాటించారు. క్యాలరీలను నియంత్రించడం, అవసరానికి తగ్గట్టుగా ప్రోటీన్ పరిమాణాన్ని సర్దుబాటు చేయడం, పోషకాహార నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక డైట్ తీసుకోవడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని సమాచారం. ఈ మార్పు సహజమైన ఫిట్‌నెస్, డైట్ ద్వారానే వచ్చిందని ఆయన ట్రైనర్ కూడా స్పష్టం చేశారు.

అయితే ఈ మార్పు అంత ఈజీగా రాలేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాటల్లో చెప్పాలంటే, ఒక దశలో ఎన్టీఆర్ మరీ సన్నగా, బలహీనంగా కనిపించడంతో షూటింగ్ యూనిట్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారట. "ఆపమని చాలాసార్లు చెప్పినా వినలేదు" అని ప్రశాంత్ నీల్ చెప్పడం ఆయన కమిట్‌మెంట్‌కు నిదర్శనం.ఒక వర్గం అభిమానులు "పాత్ర కోసం ఇంత కష్టపడటం ఎన్టీఆర్‌కే సాధ్యం" అంటూ ఆయన అంకితభావాన్ని ప్రశంసించారు. మరోవైపు కొందరు మాత్రం "పాత లుక్‌లోనే ఎన్టీఆర్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండేవాడు", "ఇంత సన్నగా ఉండడం బాగోలేదు, ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి" అంటూ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే టీజర్ చూసిన తర్వాత చాలా మంది, ఈ లుక్‌కు సినిమాలోని పాత్రతో బలమైన సంబంధం ఉంటుందని భావిస్తూ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Published : 
  • 10 July 2026, 7:50 PM IST