తెలంగాణ జానపద కథకు యూనివర్సల్ ఎమోషన్..!

తెలంగాణ నేల వాసన... జానపద సంస్కృతి... గ్రామీణ భావోద్వేగాలు... ఇవన్నీ వెండితెరపై మరోసారి ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు 'బలగం' దర్శకుడు వేణు. అయితే ఈసారి ఆయన లక్ష్యం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.

Post Published By: dialnews
Updated : 14 July 2026, 4:50 PM IST

తెలంగాణ నేల వాసన... జానపద సంస్కృతి... గ్రామీణ భావోద్వేగాలు... ఇవన్నీ వెండితెరపై మరోసారి ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు 'బలగం' దర్శకుడు వేణు. అయితే ఈసారి ఆయన లక్ష్యం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు. అదే... 'ఎల్లమ్మ'. మరి తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా ఎలా మెప్పిస్తుంది అనేది ఇప్పుడు సినీ అభిమానుల మనసులో ఉన్న కామన్ క్వశ్చన్.

'బలగం' సినిమాతో ప్రతి ఇంటిని కదిలించిన దర్శకుడు వేణు... ఇప్పుడు 'ఎల్లమ్మ'తో మరింత పెద్ద కాన్వాస్‌పై ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గ్రామీణ జీవితం, కుటుంబ అనుబంధాలు, ఆచారాలు, సంప్రదాయాలు, జానపద విశ్వాసాలు... ఇవన్నీ కలగలిపి ఒక భావోద్వేగ కథను చెప్పేందుకు సిద్ధమయ్యారు.తెలంగాణలో ఎల్లమ్మ దేవతకు ఉన్న విశిష్ట స్థానం, గ్రామాల్లో జరిగే జాతరలు, ప్రజల విశ్వాసాలు ఈ సినిమాకు ప్రధాన నేపథ్యంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ కథ అయినప్పటికీ... ఇందులోని భావోద్వేగాలు మాత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయనే నమ్మకంతో చిత్రబృందం ఉంది.

ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరగడానికి మరో ప్రధాన కారణం... దేవిశ్రీ ప్రసాద్. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన డీఎస్పీ... ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత దర్శకుడిగా ఇప్పటికే భారతదేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమాన వర్గం... ఇప్పుడు నటుడిగానూ ఆయనను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.అలాగే 'బలగం' విజయంతో దర్శకుడు వేణుపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడింది. భారీ బడ్జెట్‌, స్టార్ హీరోలు లేకుండానే ఒక హృదయాన్ని తాకే కథతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన వేణు... ఇప్పుడు 'ఎల్లమ్మ'తో మరోసారి భావోద్వేగాల ప్రయాణానికి తీసుకెళ్తారని అభిమానులు భావిస్తున్నారు.

పాన్-ఇండియా ట్రెండ్‌లో ఎక్కువగా యాక్షన్‌, మాస్‌, ఫాంటసీ సినిమాలే కనిపిస్తున్న ఈ సమయంలో... తెలంగాణ జానపద సంస్కృతిని కేంద్రంగా చేసుకుని ఒక ఎమోషనల్ డ్రామాను దేశవ్యాప్తంగా విడుదల చేయడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. సినిమా పాన్-ఇండియా స్థాయిలో విజయం సాధించాలంటే కేవలం భారీ విడుదల సరిపోదు. కథ, కథనం, భావోద్వేగాలు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. అదే 'బలగం'తో నిరూపించిన వేణు... 'ఎల్లమ్మ'తో మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Published : 
  • 14 July 2026, 4:50 PM IST