ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి'పై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు మొదలవడంతో గత నెలలో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా అటకెక్కింది. జలసంధిపై పట్టు సాధించేందుకు అగ్రరాజ్యం అమెరికా చేసిన ప్రకటన ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతనను మరింత ఉద్రిక్తంగా మార్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధికి ఇకపై అమెరికానే రక్షకురాలని ప్రకటించారు. ఈ సముద్ర మార్గం గుండా వెళ్లే నౌకలకు తాము పూర్తి భద్రత కల్పిస్తామని, దానికి బదులుగా ప్రయాణించే ప్రతి నౌక తమకు 20 శాతం ఫీజు చెల్లించాలని కొత్త నిబంధన విధించారు. అంతేకాకుండా, ఇరాన్‌పై ఆర్థిక దిగ్బంధం అమలు చేస్తున్నామని, ఇరాన్‌కు చెందిన నౌకలు గానీ, ఆ దేశంతో వ్యాపారం చేసే ఇతర దేశాల నౌకలు గానీ ఈ జలసంధి గుండా ప్రయాణించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇతర దేశాల నౌకలు మాత్రం ఫీజు చెల్లించి సురక్షితంగా వెళ్లవచ్చని స్పష్టం చేశారు. 11 గంటల సమావేశంలో ఇరాన్ అన్నింటికీ అంగీకరించి, బయటకు వచ్చాక మాట మార్చిందని ట్రంప్ విమర్శించారు.
అమెరికా ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉంటుందని, ఇందులో అమెరికా జోక్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించింది. పరిస్థితి విషమించడంతో ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగాయి. అమెరికా దళాలు ఇరాన్ తీర ప్రాంతాలైన ఖార్గ్ దీవి, బందర్ అబ్బాస్ తదితర చోట్ల దాడులు చేయగా, దానికి ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్, ఖతర్, జోర్డాన్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్‌లపై ఇరాన్ విరుచుకుపడింది. తమ ఆత్మరక్షణ కోసమే అమెరికా స్థావరాలపై దాడులు చేశామని ఇరాన్ సమర్థించుకుంది.
గత నెలలో స్విట్జర్లాండ్‌లో పాకిస్థాన్, ఖతర్ దేశాల మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ, నిబంధనల అమలు విషయంలో ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో అది కాస్తా బెడిసికొట్టింది. తమ జలసంధిలో ఏ నౌక వెళ్లాలి, ఏది వెళ్లకూడదు అని నిర్ణయించే అధికారం తమకే ఉందని ఇరాన్ వాదించగా, అమెరికా దాన్ని వ్యతిరేకించింది. ఇరాన్ కొన్ని నౌకలపై దాడులు చేయడం, అమెరికా ప్రతిదాడులు చేయడంతో ఒప్పందం రద్దయింది.
అమెరికానే ముందుగా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. హార్ముజ్ జలసంధిలో అమెరికా అనవసరంగా కల్పించుకోవడం వల్లే ఈ అస్థిరత ఏర్పడిందని ఇరాన్ చెప్తోంది. అమెరికా చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండేంత వరకు ఈ ఘర్షణలు తప్పవని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో, ఇస్లామాబాద్‌లో జరగాల్సిన తదుపరి విడత శాంతి చర్చలు ఇక జరిగే అవకాశం లేదని ఇరాన్ సంకేతాలిచ్చింది. మొత్తం మీద, హార్ముజ్ జలసంధి రక్షణ పేరుతో అమెరికా 20% ఫీజు వసూలు చేయాలని చూడటం, దాన్ని ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటించడంతో గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.