షాబాద్‌లో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలతో పాటు తన భార్యాపిల్లలను నిందితుడు రాజ్‌కుమార్ అత్యంత కిరాతకంగా అంతమొందించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయశాంతి, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిందితుడి నుంచి లంచం తీసుకుని పోలీసులు అతడికి బెయిల్ వచ్చేలా సహకరించారన్న వార్తలు తెలంగాణ మహిళా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రక్షించాల్సిన పోలీసులే చేసిన ఈ ఘోరమైన తప్పు వల్లే ఆరుగురు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిశాయని మండిపడ్డారు. పోలీసు శాఖలోని ఇలాంటి లోపాలు, అవినీతి వల్ల రాష్ట్రంలో మహిళల భద్రత, శాంతిభద్రతలపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉందని విజయశాంతి హెచ్చరించారు. మహిళలకు పెద్దపీట వేస్తామని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షాబాద్ నరమేధాన్ని, దీని వెనుక ఉన్న పోలీసుల వైఫల్యాలను అత్యంత సీరియస్‌గా పరిగణించాలని ఆమె డిమాండ్ చేశారు. షాబాద్ ఘోర కలికలిలో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ జులై 13న కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బాను, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌లో రాజ్ కుమార్ ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోను గుర్తించారు. ఆ వీడియోలో, బాలిక కుటుంబం తనను ఆర్థికంగా వాడుకుని, మోసం చేసిందని, తప్పుల కేసులు పెట్టి జైలుకు పంపిందని రాజ్ కుమార్ ఆరోపించాడు. "నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు. నా చావుకు వాళ్లే కారణం," అని వీడియోలో పేర్కొన్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో కేసు ముగిసిపోయిందని పోలీసులు భావించడం సరికాదని విజయశాంతి స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న లోపాలను సరిదిద్ది, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.