ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. కార్డిఫ్ వేదికగా గురువారం జరిగే రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇది కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. తద్వారా బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకుంటుంది.రెండో వన్డేలో భారత్ విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ మైదానం పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం చాలా తక్కువ. అయితే తొలి వన్డే తరహాలోనే టీమిండియా ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు నలుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది.తొలి వన్డే విజయానంతరం ప్రయోగాలు చేస్తామని శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు.
ఇంగ్లండ్ మైదానాలు ప్రపంచకప్ జరిగే సౌతాఫ్రికాకు దగ్గరగా ఉంటాయని, జట్టు బెంచ్‌ను పరీక్షిస్తామని చెప్పాడు. ఈ క్రమంలో ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించాలనుకుంటే బౌలింగ్ విభాగంలో మార్పులు జరగవచ్చు. అలాగే బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ ఆడించాలనుకుంటే ఒక బ్యాటర్‌ను పక్కనపెట్టాల్సి ఉంటుంది. అయితే తొలి వన్డేలో గిల్ కు గాయమైన నేపథ్యంలో భారత కెప్టెన్ ఆడడంపై సస్పెన్స్ నెలకొంది.ఒకవేళ గిల్ దూరమైతే వైస్ కెప్టెన్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ తాత్కాలిక బాధ్యతలు తీసుకుంటాడు. అప్పుడు ఇషాన్ కిషన్ గిల్ స్థానంలో ఓపెనింగ్ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో ఆడనున్నారు. తొలి వన్డేలో రోహిత్, కోహ్లీ, రాహుల్ తీవ్రంగా నిరాశపర్చారు. ఈ ముగ్గురు రెండో వన్డేలో సత్తా చాటాల్సి ఉంది. ఎందుకంటే వన్డే ప్రపంచకప్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ , కోహ్లీలకు ప్రతీ మ్యాచ్ కీలకమే. ఇక తొలి వన్డేలో సుందర్, అక్షర్ పటేల్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత అక్షర్ పటేల్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. కాగా శివమ్ దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా బౌలింగ్‌తో మెప్పించాడు. గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ బుమ్రాలు ఆకట్టుకున్నారు. రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగిస్తే భారత్ ఈజీగా విజయం సాధిస్తుంది.