హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పార్టీ లవర్స్ అండ్ పబ్ కల్చర్ వీకెండ్ గ్యాంగ్స్.. బీ అలర్ట్. మీరు సరదా కోసం జూబ్లీహిల్స్ పబ్‌లలో అడుగుపెడుతున్నారా? అయితే మీపై పోలీసుల డేగకన్ను పడింది. హైదరాబాద్‌లోనే డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న జూబ్లీహిల్స్ జోన్‌ను పోలీసులు ఇప్పుడు ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. ఇక్కడ మత్తులో దొరికితే మీ కెరీర్ క్లోజ్ అవ్వడమే కాదు.. జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం. అసలు జూబ్లీహిల్స్ జోన్లో పోలీసులు సృష్టిస్తున్న ప్రకంపనలు ఏంటి?
హైదరాబాద్ సిటీ మొత్తం మీద పోలీసులు ఏడాదిలో 563 డ్రగ్స్ కేసులు నమోదు చేస్తే.. అందులో కేవలం జూబ్లీహిల్స్ జోన్ పరిధిలోనే అత్యధికంగా 116 కేసులు నమోదయ్యాయి. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నగ్న సత్యం. సిటీలోని మిగతా అన్ని ఏరియాల కంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ బెల్ట్ లోనే మత్తు దందా విపరీతంగా సాగుతోందని పోలీసుల రికార్డులే చెబుతున్నాయి. పబ్‌లు, కేఫ్‌లు, ప్రైవేట్ విల్లాస్ ఎక్కువగా ఉండే ఈ లగ్జరీ ఏరియానే డ్రగ్స్ సప్లయర్స్ తమ మెయిన్ అడ్డాగా మార్చుకున్నారు. అందుకే పోలీసులు కూడా తమ పూర్తి ఫోకస్‌ను ఈ జోన్ పైనే పెట్టారు.
జూబ్లీహిల్స్‌లో వీకెండ్ వస్తే చాలు.. పబ్‌లు హోరెత్తిపోతాయి. కానీ ఇకపై అక్కడ మీరు చేసే ప్రతి కదలికను పోలీసులు గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే, జూబ్లీహిల్స్ జోన్ లోని ప్రముఖ పబ్‌లలో పోలీసులు ఇప్పుడు సివిల్ డ్రెస్సుల్లో తిరుగుతున్నారు. కస్టమర్ల లాగే లోపలికి వచ్చి.. అక్కడ ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నారా, సప్లై చేస్తున్నారా అని పక్కాగా నిఘా పెడుతున్నారు. మీరు పబ్ లోపల మూలల్లో కూర్చుని మత్తు పదార్థాలు ముట్టుకున్నా సరే.. పక్కనే ఉన్న పోలీస్ మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం ఖాయం.
జూబ్లీహిల్స్ రోడ్లపై అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగేవారికి పోలీసులు 'ఆపరేషన్ థండర్‌బోల్ట్' తో నరకం చూపిస్తున్నారు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మాత్రమే కాదు.. ఇప్పుడు సరికొత్త డ్రగ్ టెస్టింగ్ కిట్లతో ఆన్ ది స్పాట్ తనిఖీలు చేస్తున్నారు. సిటీ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,550 మందికి పైగా ఈ ఆన్ ది స్పాట్ డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో ఎక్కువ శాతం జూబ్లీహిల్స్ నైట్ లైఫ్ ఏరియాలోనే జరిగాయి. ఈ కిట్లు ఎంత పవర్ఫుల్ అంటే.. మీరు రెండు మూడు రోజుల క్రితం డ్రగ్స్ వాడినా సరే, ఈ టెస్టులో పాజిటివ్ అని ముక్కు పిండి సాక్ష్యంతో సహా పట్టిస్తాయి.
ఈ జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో జరుగుతున్న దాడుల్లో కేవలం గంజాయి మాత్రమే కాదు.. అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఎండీఎంఏ, కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డీ స్టాంపులు, హ్యాష్ ఆయిల్ లాంటి ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఇక్కడ లభ్యమవుతున్నాయి. వీటి విలువ మార్కెట్లో గ్రాముకు వేలల్లో ఉంటుంది. బడా బాబుల పిల్లలు, ఐటీ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్‌ను టార్గెట్ చేస్తూ జూబ్లీహిల్స్ పబ్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ కోట్ల రూపాయల మత్తు సామ్రాజ్యాన్ని పోలీసులు ఒక్కొక్కటిగా బద్దలు కొడుతున్నారు.
మొత్తం ఏడాదిలో సిటీ వ్యాప్తంగా రూ.22.17 కోట్ల విలువైన డ్రగ్స్‌ను, 2,513 కిలోల గంజాయిని సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ యువతకు పోలీసులు ఇచ్చే స్ట్రిక్ట్ వార్నింగ్ ఒక్కటే.. ఒక్క క్షణం సరదా కోసం డ్రగ్స్ వైపు వెళ్తే మీ జీవితం రోడ్డున పడుతుంది. డ్రగ్స్ కేసులో ఒక్కసారి పేరు నమోదైతే లేదా డ్రగ్ టెస్టులో పాజిటివ్ వస్తే.. మీ భవిష్యత్తు అంధకారమే. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడిపోతాయి, కొత్త ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ క్లియర్ అవ్వదు, విదేశాలకు వెళ్లే వీసాలు దొరకవు. అన్నిటికంటే ముఖ్యంగా సమాజంలో, కుటుంబంలో పరువు పూర్తిగా గంగలో కలిసిపోతుంది. అందుకే జూబ్లీహిల్స్ జోన్ లోని పబ్‌లకు వెళ్లేటప్పుడు వందసార్లు ఆలోచించుకోండి.హైదరాబాద్‌ను, ముఖ్యంగా జూబ్లీహిల్స్ లాంటి నడిబొడ్డు ప్రాంతాలను డ్రగ్స్ రహితంగా మార్చే వరకు ఈ 'ఆపరేషన్ థండర్‌బోల్ట్' దాడులు ఆపబోమని పోలీసులు తేల్చి చెప్పారు. కాబట్టి మత్తుకు దూరంగా ఉండండి, ప్రాణాలను, కెరీర్‌ను కాపాడుకోండి.