అమెరికాను అడుక్కుంటున్న పాకిస్తాన్.. 10 బిలియన్ల కోసమే మీడియేషన్ డ్రామా..!

ఇస్లామాబాద్ టాక్స్.. ఈ పేరుతోనే పీస్ మేకర్ అవతారం ఎత్తింది పాకిస్తాన్. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేస్తామంటూ ఇస్లామాబాద్‌లో చాలా డ్రామాలే ఆడింది. ఇస్లామాబాద్ టాక్స్ పేరుతో సదస్సులు, దౌత్య ప్రకటనలు గుప్పిస్తూ అంతర్జాతీయ సమాజం

Post Published By: dialnews
Updated : 23 July 2026, 6:30 PM IST

ఇస్లామాబాద్ టాక్స్.. ఈ పేరుతోనే పీస్ మేకర్ అవతారం ఎత్తింది పాకిస్తాన్. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేస్తామంటూ ఇస్లామాబాద్‌లో చాలా డ్రామాలే ఆడింది. ఇస్లామాబాద్ టాక్స్ పేరుతో సదస్సులు, దౌత్య ప్రకటనలు గుప్పిస్తూ అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు తాపత్రయపడింది. అయితే, ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాల వల్ల గ్రౌండ్ లెవెల్‌లో జరిగింది శూన్యం. యుద్ధం ముగియలేదు సరిగదా.. ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ పీస్ ప్రయత్నాల వెనుక అసలు కథ వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ వేషాలు నిజంగా శాంతి నెలకొల్పడానికి కాదు, అగ్రరాజ్యాన్ని అడుక్కోడానికే అని తేలిపోయింది. ఏకంగా 10 బిలియన్ డాలర్ల కోసం వాషింగ్టన్‌కు సీక్రెట్‌గా పంపిన ప్రతిపాదనలు పాకిస్తాన్ అసలు రంగు బయట పెట్టేశాయి.

ఔను.. మధ్యవర్తిత్వం అనే ముసుగును వాడుకుని వాషింగ్టన్‌తో దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, తద్వారా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తమ దేశానికి డాలర్ల ప్యాకేజీని రాబట్టాలని పాక్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అందులో భాగంగానే, అమెరికా నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ మొత్తంతో కూడిన 10 బిలియన్ డాలర్ల ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీని పొందడానికి తెరవెనుక పెద్ద ప్లానే వేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌కు ఒక రహస్య ప్రతిపాదనను పంపినట్లు అంతర్జాతీయ కథనాలు తెలిపాయి. ఐదేళ్ల కాలపరిమితితో 10 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని ఇస్లామాబాద్ అమెరికాను వేడుకుంది. పాకిస్తాన్‌లో రోజురోజుకూ పడిపోతున్న విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో పాకిస్తానీ రూపాయి విలువపై ఉన్న విపరీతమైన ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ నిధులు తమకు సంజీవని లాంటివని పాక్ ఆ లేఖలో మొరపెట్టుకుంది.

ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి IMF దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉందనేది ఓపెన్ సీక్రెట్. 7 బిలియన్ డాలర్ల IMF ప్రోగ్రామ్ కింద కఠినమైన, ప్రజావ్యతిరేక ఆర్థిక నిబంధనలను అమలు చేస్తూ పాక్ పాలకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దీనివల్ల దేశంలో పన్నులు విపరీతంగా పెంచాల్సి వచ్చింది, ప్రభుత్వ వ్యయాలను తగ్గించాల్సి వచ్చింది. ఈ నిర్ణయాల వల్ల పాకిస్తాన్ అంతటా అంతర్గత తిరుగుబాట్లు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా గనుక ఈ 10 బిలియన్ డాలర్ల సదుపాయాన్ని అందిస్తే.. దేశానికి IMFకఠిన నిబంధనల నుండి, అలాగే అత్యవసర రుణాల భారం నుండి పెద్ద ఉపశమనం లభిస్తుందని పాక్ ఆశపడుతోంది. కానీ, పాకిస్తాన్ కోరుతున్న ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ సదుపాయం అంత తేలిగ్గా లభించేది కాదు. యుఎస్ ట్రెజరీ ఈ నిధులను అత్యంత అరుదైన సందర్భాల్లో, అమెరికాకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన భాగస్వామ్య దేశాలకు మాత్రమే ఇస్తుంది. 2025లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న అర్జెంటీనాకు, అలాగే 2002లో ఉరుగ్వేకు మాత్రమే ఇటువంటి ప్రత్యేక ప్యాకేజీలను అమెరికా అందించింది. ఇప్పుడు ఏ అర్హత లేకపోయినా, కేవలం దౌత్య నాటకాలతో ఆ దేశాల సరసన చేరి అమెరికా ఖజానాను కొల్లగొట్టాలని పాక్ చూస్తోంది.

పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. 2023లో 3 బిలియన్ డాలర్ల IMF స్టాండ్‌ బై ఒప్పందంతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు డిఫాల్ట్ కాకుండా బయటపడింది. ఆ తర్వాత మళ్లీ 7 బిలియన్ డాలర్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ, వాతావరణ మార్పుల పేరుతో మరో 1.3 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందింది. ఇవన్నీ ఉన్నా, సొంతంగా ఆదాయాన్ని సృష్టించుకునే శక్తి లేక.. చైనా, సౌదీ అరేబియా ఇచ్చే రోల్‌ఓవర్లు, డిపాజిట్లపైనే పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఒక చేత్తో అప్పు తెచ్చి.. మరో చేత్తో పాత అప్పు తీర్చడమే పాక్ నిత్యకృత్యంగా మారింది. ఏప్రిల్‌లో యూఏఈకి పాకిస్తాన్ ఏకంగా 3.5 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. ఆ సమయంలో చేతిలో పైసలు లేక దిక్కుతోచని స్థితిలో ఉంటే, సౌదీ అరేబియా 3 బిలియన్ డాలర్ల కొత్త ఆర్థిక మద్దతు అందించి పాక్‌ను గండం నుండి గట్టెక్కించింది.

మొత్తంగా.. ఇరాన్-అమెరికా మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలను, తన ఖజానా నింపుకునేందుకు పాక్ ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. ప్రపంచ శాంతి దూత ముసుగు వేసుకుని, వాషింగ్టన్ డాలర్ల పెట్టెపై కన్నేసి.. 10 బిలియన్ డాలర్ల భారీ భిక్ష కోసం తెరవెనుక దౌత్య నాటకమాడింది. మరి పాక్ పంపిన 10 బిలియన్ డాలర్ల ప్రపోజల్‌ను యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ డస్ట్‌బిన్‌లో వేస్తారా.. లేక దౌత్యపరంగా పాకిస్తాన్‌ను వాడుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది చూడాలి.

 

Published : 
  • 23 July 2026, 6:30 PM IST