తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పేరుతో నడుస్తున్న ‘రా ఎన్టీఆర్’ సేవా సంస్థ వివాదం.. కేవలం సినీ రచ్చ కాదు, దీని వెనుక ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉందనే ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయి. వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సేవలు చేస్తామంటూ తిరుపతి వేదికగా హడావుడి చేసిన ఈ సంస్థ వెనుక.. కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఉందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో ఆధారాలతో సహా విరుచుకుపడుతున్నాయి. అయితే ఈ పొలిటికల్ కుట్రను జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఒకే ఒక్క అధికారిక ప్రకటనతో బట్టబయలు చేసింది. అసలు ఎన్టీఆర్ పేరుతో వైసీపీ వేసిన ఆ రాజకీయ వ్యూహం ఏంటి? తారక్ దెబ్బకు నిర్వాహకులు బోర్డు తిప్పేసి ఎలా పారిపోయారు?
రాజకీయంగా పూర్తిగా దెబ్బతిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి, నందమూరి అభిమానుల్లో చీలక తేవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ను వాడుకోవాలని చూస్తోందనే చర్చ పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అందులో భాగమే ఈ ‘రా ఎన్టీఆర్’ సంస్థ హడావుడి. తారక్ పేరు మరియు ఫోటోలను వాడుకుంటూ.. రూ. 100 కోట్లతో ఊరు-వాడ’ కార్యక్రమం చేస్తామని, కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు కలరింగ్ ఇవ్వడానికి ఈ సంస్థ ప్రయత్నించిందని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీని వెనుక ఉన్న నిర్వాహకుల పాత సోషల్ మీడియా రికార్డులను తవ్వి తీసిన కూటమి శ్రేణులు.. వీరంతా పక్కా వైసీపీ సానుభూతిపరులని తేల్చి చెప్పడంతో అసలు రచ్చ మొదలైంది.
ఈ వివాదంపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత ఐదారు సంవత్సరాలుగా సేవ చేస్తున్నామని చెప్తున్న ఈ నిర్వాహకులకు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకు రాలేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి నందమూరి తారకరామారావు గారిని ఘోరంగా అవమానించినప్పుడు ఈ సంస్థ ఎక్కడికి పోయింది? అప్పట్లో కనీసం ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టడానికి కూడా ధైర్యం లేని వీరు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే వంద కోట్లతో సేవలంటూ హడావుడి చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు. నాడు వైసీపీ అరాచకాలను ప్రశ్నించని వారు, నేడు ఎన్టీఆర్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ శ్రేణులు కడిగిపారేశాయి.
తాము ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకుంటూ వైసీపీకి ఫేవర్ గా వ్యవహరిస్తున్న ఈ బ్యాచ్‌కు.. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం గట్టి షాక్ ఇచ్చింది. తారక్ పీఆర్ టీమ్ అధికారిక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ.. "రా ఎన్టీఆర్ అనే సంస్థతో కానీ, వారి కార్యకలాపాలతో కానీ హీరో ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదా భాగస్వామ్యం లేదు. ఆయన పేరుతో ప్రాతినిధ్యం వహించడానికి ఆ సంస్థకు ఎలాంటి హక్కులు లేవు" అని తేల్చి చెప్పింది. ఈ ఒక్క ప్రకటనతో వైసీపీ వేసిన పొలిటికల్ స్కెచ్ అంతా తలకిందులైంది. ఎన్టీఆర్‌ను రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందాలని చూసిన వారి ఆశలపై తారక్ ఆఫీస్ నీళ్లు చల్లింది.
తొలుత, "ఎన్టీఆర్ చెప్పినా సరే మేము ఆగం.. సేవలు కొనసాగిస్తాం" అంటూ సంస్థ ఆర్గనైజర్ సాయి రూప్ తిరుపతి ప్రెస్ మీట్లో అహంకారంతో మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ ఆఫీస్ స్వయంగా దూరం పెట్టిందో, అటు అధికారిక నందమూరి అభిమాన సంఘాల నుండి తీవ్రమైన ఒత్తిడి మరియు హెచ్చరికలు వచ్చాయో.. నిర్వాహకులకు సినిమా కనిపించింది. టీడీపీ శ్రేణులు వీరి వైసీపీ కనెక్షన్లను పూర్తిగా బట్టబయలు చేయడంతో ఇక లాభం లేదనుకుని.. "ఇందులో విజయం సాధించిన వారందరికీ అభినందనలు" అంటూ ట్విట్టర్ వేదికగా ఒక అస్పష్టమైన ముగింపు సందేశాన్ని ఇచ్చి, సంస్థను పూర్తిగా క్లోజ్ (షట్‌డౌన్) చేస్తున్నట్లు ప్రకటించి పారిపోయారు.ఏది ఏమైనప్పటికీ, సొంత రాజకీయ ప్రయోజనాల కోసం టాలీవుడ్ హీరోల ఇమేజ్ను వాడుకోవాలని చూస్తే.. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పేరుతో వైసీపీ మైండ్ గేమ్స్ ఆడాలని చూస్తే అభిమానులు, పార్టీ శ్రేణులు ఊరుకోరని ఈ ఘటనతో తేలిపోయింది. ఎన్టీఆర్ ఆఫీస్ సమయానికి స్పందించి ఇచ్చిన క్లారిటీతో ఈ పొలిటికల్ డ్రామాకు ఎండ్ కార్డ్ పడింది.