ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ వైట్ బాల్ పర్యటనల్లో టీమిండియా ఎదుర్కొన్న ఘోర పరాజయాలపై బీసీసీఐ దృష్టి సారించింది. వచ్చే ఆగస్టు నెల ఆరంభంలో భారత జట్టు ప్రదర్శనపై రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఐర్లాండ్‌పై ఓటమి, ఇంగ్లాండ్ చేతిలో టీ20, వన్డే సిరీస్‌లు కోల్పోవడంపై బోర్డు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.ఈ రివ్యూ మీటింగ్‌తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కింద పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ కాంట్రాక్టులపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండేళ్ల కాంట్రాక్ట్ పూర్తయిన అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు బోర్డుకు విజ్ఞప్తి చేశాడు.
మరోవైపు బీసీసీఐ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ప్రదర్శనపై కూడా సమీక్ష జరపనుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత ఆటగాళ్లు అత్యంత పేలవమైన ఫీల్డింగ్, క్యాచ్‌లు నేలపాలు చేయడంతో దిలీప్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు ఆగస్టు 15 నుంచి 27 వరకు శ్రీలంకలోని గాలే, కొలంబో వేదికలుగా జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును మంగళవారం వర్చువల్ సమావేశంలో ఎంపిక చేయనున్నారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు తిరిగొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే గతేడాది రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీకి తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కవచ్చని ప్రచారం సాగుతోంది.ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈ శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొడ కండరాల గాయం వల్ల బాధపడుతున్న నితీశ్, ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అక్కడ నెట్స్‌లో బౌలింగ్ ప్రారంభించినప్పటికీ, ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ల్లో ఆడటం అతడికి ఇప్పుడే సాధ్యం కాదని వైద్య బృందం భావిస్తోంది. సెప్టెంబర్‌లో జరగబోయే వైట్ బాల్ సిరీస్ సమయానికి నితీశ్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.