మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాను రాబోయే ఆగష్టు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన దర్శకనిర్మాతలు, ప్రచార కార్యక్రమాలలో సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో దర్శకులు కేవలం చిత్రీకరణకే పరిమితం కాకుండా ప్రమోషన్లలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే డైరెక్టర్ శివ నిర్వాణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ రవితేజతో పలు ఆసక్తికరమైన ఇంటర్వ్యూలను ప్లాన్ చేశారు.
ముఖ్యంగా, శబరిమల ఆలయ నేపధ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రమోషనల్ ఇంటర్వ్యూను నిర్వహించనున్నట్లు సమాచారం. కథాంశానికి అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఇంటర్వ్యూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. పక్కా కుటుంబ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బలమైన భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. రవితేజ నటన, శివ నిర్వాణ మార్క్ సెంటిమెంట్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి.
రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయకగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నకాస్త్ర కనిపిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్, అలాగే జీవీ ప్రకాష్ స్వరపరిచిన ‘అయ్యప్ప పడి పూజ’ పాటకి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. ఆగష్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.