చేతిలో 2 కోట్ల ఆఫర్! ఒక్క సంతకం పెడితే కోట్లు వచ్చి పడతాయి! కానీ... ఆ ఒక్క ఆఫర్‌ను 'నాకొద్దు' అని ముఖం మీదే తిరస్కరించిన ఒకే ఒక్క హీరోయిన్... సాయి పల్లవి!అసలు 2 కోట్ల బ్యూటీ ప్రొడక్ట్ ప్రకటనను ఒక టాప్ హీరోయిన్ ఎందుకు రిజెక్ట్ చేసింది? దాని వెనుక ఉన్న ఆమె సొంత చెల్లెలి కన్నీటి కథ ఏంటి? ప్రస్తుతం నితీష్ తివారీ 'రామాయణం'లో సీతగా నటిస్తున్న సాయి పల్లవి ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.గ్లామర్ ప్రపంచంలో చాలామంది స్టార్స్ యాడ్స్ ద్వారా కోట్లు సంపాదిస్తుంటారు. కానీ సాయి పల్లవి ఆలోచన దానికి పూర్తిగా భిన్నం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండ్ ఆమెకు ఏకంగా 2 కోట్ల కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చింది. కానీ సాయి పల్లవి నిర్మొహమాటంగా 'నో' చెప్పారు. 'డబ్బు కోసం నా నైతిక విలువలను అమ్మలేను' అని స్పష్టం చేశారు.
సాధారణంగా ఆమె బ్యూటీ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయరు, రియల్ లైఫ్‌లోనూ మేకప్ చాలా అరుదుగా వాడతారు. 'మనం అందంగా కనిపించాలంటే తెల్లగా ఉండాల్సిన అవసరం లేదు... మన రూపంపై మనకు నమ్మకం ఉండాలి' అని ఆమె చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరినీ ఆలోచనలో పడేశాయి.
అయితే, ఈ ఆఫర్‌ను తిరస్కరించడం వెనుక ఓ భావోద్వేగమైన కారణం ఉంది. సాయి పల్లవి కొంచెం తెల్లగా ఉంటే, ఆమె చెల్లెలు ముదురు రంగు చర్మంతో ఉండేది. చిన్నతనంలో వాళ్ల అమ్మ చెల్లెలికి ఇష్టం లేని పండ్లు, కూరగాయలు తినిపించడానికి 'ఇవి తింటే అక్కలా తెల్లగా అవుతావు' అని చెప్పేదట. అది చూసి చిన్ననాటి నుంచే ఆ పాప మనసులో రంగు గురించిన అభద్రతా భావం ఏర్పడింది. రంగు కోసం చెల్లెలు పడే తాపత్రయం చూసి సాయి పల్లవి చలించిపోయారు.
'చిన్న పిల్లల మనస్సులపై ఈ రంగు పిచ్చి ఎంతటి ప్రభావం చూపుతుందో నాకు అప్పుడే అర్థమైంది. కనీసం నా చెల్లెలికి ఆత్మవిశ్వాసం ఇవ్వడం కోసమైనా నేను ఈ ఫెయిర్‌నెస్ యాడ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. అంత డబ్బు తీసుకుని నేనేం చేసుకోవాలి?' అని సాయి పల్లవి అడిగిన ప్రశ్న నెటిజన్ల హృదయాలను తాకింది. సినిమాల్లోకి రాకముందు సాయి పల్లవి కూడా సామాన్య జనాల్లాగే చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారట. ముఖంపై ఉన్న మొటిమల వల్ల బయటకు రావడానికి భయపడేవారట. 'జనాలు నా కళ్లలోకి చూడకుండా నా మొటిమలనే చూస్తున్నారనిపించేది' అని ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. కానీ మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్' సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. మేకప్ లేకుండా, మొటిమలతోనే స్క్రీన్ పై కనిపించిన సాయి పల్లవిని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రూపం కంటే సహజత్వమే అసలైన అందం అని ఆమె గుర్తించారు. కోట్ల రూపాయిల కంటే, గ్లామర్ హంగామా కంటే నైతిక విలువలకే పెద్దపీట వేసిన సాయి పల్లవి నిజంగానే రియల్ లైఫ్ క్వీన్ అంటూ పొగడ్తలతో అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.