భారత రాజకీయాల్లోనే అత్యంత అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగి సరికొత్త చరిత్ర సృష్టించారు. నిన్న మొన్నటి వరకు తెర వెనుక ఉంటూ ఎందరినో సీఎంలను, పీఎంలను చేసిన PK, తన జీవితంలో మొదటిసారి నేరుగా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించారు. బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 1995 నుంచి అంటే దాదాపు 30 ఏళ్లుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న స్థానాన్ని ప్రశాంత్ కిశోర్ తన సొంత పార్టీ 'జన్ సూరాజ్' తరఫున ఏకంగా 19,000 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకున్నారు. నితీష్ కుమార్ తప్పుకున్నాక సీఎం పీఠం ఎక్కిన బీజేపీ నేత సామ్రాట్ చౌదరి నాయకత్వానికి ఇది కోలుకోలేని దెబ్బ. కేవలం 8 నెలల క్రితం 52,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన సీటును బీజేపీ ఎలా పోగొట్టుకుంది?
ఈ ఉపఎన్నికను ప్రశాంత్ కిశోర్ అత్యంత తెలివిగా మార్చేశారు. ఇది కేవలం ఒక నియోజకవర్గ ఎన్నిక కాదు, బీహార్‌కు కొత్త సీఎం అయిన సామ్రాట్ చౌదరి నాయకత్వానికి ఇదొక పరీక్ష అని PK ప్రచారం చేశారు. నితీష్ కుమార్ తర్వాత సీఎం పీఠాన్ని అధిష్టించిన సామ్రాట్ చౌదరి విద్యా అర్హతలు, నేర చరిత్రపై PK నేరుగా దాడి చేశారు. ఫలితం వచ్చాక కూడా, "బీజేపీ అధిష్ఠానానికి బంకీపూర్ ప్రజలు గట్టి సందేశం ఇచ్చారు.. దయచేసి బీహార్‌కు ఒక మంచి, సమర్థుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టండి" అంటూ PK పవర్‌ఫుల్ కామెంట్స్ చేశారు.
దీనికి తోడు, బంకీపూర్ సీటు గత 20 ఏళ్లుగా నితిన్ నబిన్ కుటుంబం చేతిలోనే ఉంది. 1995 నుండి ఇక్కడ ఒకే కుటుంబం ఏలుతుండటంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 30 ఏళ్లుగా గెలిపిస్తున్నా స్థానికంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న కోపం ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. "నేను గెలిచినంత మాత్రాన బంకీపూర్ రాత్రికి రాత్రే బెంగళూరు అయిపోదు, కానీ రాబోయే రెండు మూడు నెలల్లోనే మార్పును చూపిస్తా" అని PK ఇచ్చిన భరోసా ఓటర్లను ఆకట్టుకుంది. బీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ కి ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంక్ అనేది ఒక ఉక్కు కోట లాంటిది. కానీ ఈ ఉపఎన్నికలో ఆ కోట పూర్తిగా బద్దలైంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న ముస్లిం ఓటర్లు, ఈసారి RJD కంటే ప్రశాంత్ కిశోరే సరైన ప్రత్యామ్నాయం అని బలంగా నమ్మారు.
దీంతో ముస్లిం ఓట్లన్నీ ఆర్జేడీని వదిలి జన్ సూరాజ్ వైపు మళ్లాయి. ఫలితంగా ఆర్జేడీ అభ్యర్థి కేవలం 14,000 ఓట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఈ దెబ్బతో తేజస్వి యాదవ్ నాయకత్వంపై, ఆర్జేడీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్న గుర్తు పడింది. రాబోయే రోజుల్లో బీహార్‌లో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ప్రశాంత్ కిశోర్ ఆక్రమించబోతున్నారనే దానికి ఈ ఫలితమే నిదర్శనం. బీజేపీకి ఎప్పుడూ అండగా ఉండే అప్పర్ కాస్ట్ అంటే.. ఓట్లు కూడా ఈసారి చేజారిపోయాయి. ప్రశాంత్ కిశోర్ స్వయంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం, ఆయన చెప్పిన అభివృద్ధి ప్రణాళికలు నచ్చడంతో కాయస్థ, భూమిహార్ ఓటర్లు పెద్ద ఎత్తున జన్ సూరాజ్ వైపు మొగ్గు చూపారు.
కేవలం 34 శాతం తక్కువ ఓటింగ్ నమోదైనప్పటికీ, బీజేపీ సంప్రదాయ ఓటర్లు ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది బీజేపీ నేతల అహంకారం. "బంకీపూర్‌లో బీజేపీ టికెట్ ఇస్తే ఒక కుక్క నిలబడినా గెలుస్తుంది" అంటూ ఎన్నికల ముందు కొందరు బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ యువతను, ఓటర్లను తీవ్రంగా గాయపరిచాయి. ఇటీవల జరిగిన పేపర్ లీక్ వివాదాలతో నిరాశలో ఉన్న విద్యార్థులు, యువత.. బీజేపీ అహంకారానికి తమ ఓటుతో బుద్ధి చెప్పారు. బీహార్ ప్రజలు ఎప్పుడూ రాజకీయ అహంకారాన్ని సహించరని ఈ తీర్పుతో మరోసారి నిరూపితమైంది.
బంకీపూర్ ఉపఎన్నిక ఫలితం బీహార్‌లో రాత్రికి రాత్రే ప్రభుత్వాన్ని మార్చకపోవచ్చు. కానీ బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని, చర్చను పూర్తిగా మార్చేసింది. కులాల చుట్టూ తిరిగే బీహార్ రాజకీయాల్లో, కేవలం అభివృద్ధి, విద్య, ఉపాధి అనే నినాదాలతో ప్రశాంత్ కిశోర్ సాధించిన ఈ విజయం ఒక మైలురాయి. రాజకీయ వ్యూహకర్తగా ఎందరినో గెలిపించిన PK, ఇప్పుడు స్వయంగా ప్రజాక్షేత్రంలో లీడర్‌గా నిలిచారు. ఇది ఒక ఉపఎన్నికల సంచలనమేనా, లేక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద తుఫానుకు సంకేతమా అనేది కాలమే నిర్ణయించాలి.