భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియాకప్‌లో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయి. అయితే తాజాగా మరోసారి దాయాదుల పోరుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మహిళల ఆసియా కప్ 2026 షెడ్యూల్‌ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. పొట్టి ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నమెంట్లో ప్రతిష్టాత్మక భారత్, పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ సెప్టెంబర్ 5న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. క్రికెట్ అభిమానులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ఈ హైవోల్టేజ్ సమరానికి దుబాయ్ వేదిక కానుంది.
ఈ టోర్నమెంట్ ఆగస్టు 28న ప్రారంభమై సెప్టెంబర్ 13 వరకు సాగనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో థాయిలాండ్, హాంకాంగ్ చైనా జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఎ లో భారత్, పాకిస్థాన్లతో పాటు థాయిలాండ్, హాంకాంగ్ చైనా జట్లు చోటు దక్కించుకున్నాయి. గ్రూప్-బిలో ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఇండోనేషియా జట్లు పోటీపడనున్నాయి.భారత జట్టు తన ఆసియా కప్ ప్రచారాన్ని ఆగస్టు 30న థాయిలాండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా ప్రారంభించనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న హాంగ్‌కాంగ్‌తో, సెప్టెంబర్ 5న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ప్రతీ గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
సెమీఫైనల్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 10, 11 తేదీలలో జరగనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన విశేషమేమిటంటే.. మ్యాచ్‌లన్నీ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి. మహిళల ఆసియాకప్ ఇప్పటివరకు 9 సార్లు జరిగింది. ఇందులో టీమిండియాదే ఆధిపత్యం. భారత మహిళలు ఏకంగా ఏడుసార్లు టైటిల్ సాధించారు. బంగ్లాదేశ్, శ్రీలంక ఒక్కోసారి టైటిల్ నెగ్గాయి. పాకిస్థాన్ మాత్రం ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. ఆ జట్టు రెండుసార్లు భారత్ చేతిలో ఫైనల్లో పరాజయం పాలైంది. ఇటీవల టీ20 ప్రపంచకప్ లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన భారత్ ఆసియాకప్ లో తన ఆధిపత్యం కొనసాగించాలని ఎదురుచూస్తోంది.