టాప్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ను ఊపేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ఒక సరికొత్త మలుపు తిరిగింది. తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లతో బిజీగా మారిన ఈ భామ, ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉండటం ట్రేడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.ఇటీవల ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, ఫ్లాప్‌గా మిగలడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు, సక్సెస్ ఉన్న సమయంలో ఆమె తన పారితోషికాన్ని భారీగా పెంచారనే వార్తలు కూడా చిత్రసీమలో తెగ ప్రచారం అయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క కొత్త తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం.దీంతో, టాలీవుడ్ మేకర్సే ఆమెను కాస్త పక్కన పెట్టారా?లేక వరుస సినిమాలతో అలసిపోయి తనే స్వయంగా గ్యాప్ తీసుకుందా?
అనే అంశంపై టాలీవుడ్‌లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.తెలుగులో తాత్కాలికంగా కాస్త నెమ్మదించినప్పటికీ, శ్రీలీల తన దృష్టిని ఇతర చిత్ర పరిశ్రమల వైపు మళ్లించింది. తమిళ, హిందీ భాషల్లో సత్తా చాటేందుకు ఆమె సిద్ధమవుతోంది. ప్రస్తుతం వర్సటైల్ యాక్టర్ ధనుష్ సరసన ఒక భారీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.
స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది శ్రీ లీల. బాలీవుడ్ యంగ్ హీరో ఇబ్రహీం అలీ ఖాన్ సరసన ‘దిలేర్’ అనే చిత్రంలోనూ భాగమైంది ఈ తెలుగు ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లో ఎదురైన చిన్నపాటి ఎదురుదెబ్బలను అధిగమించి, ఇతర భాషల్లో వరుస ఆఫర్లతో పాగా వేసేందుకు శ్రీలీల వేగంగా అడుగులు వేస్తోంది. భాషతో సంబంధం లేకుండా పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్న ఈ భామ, కోలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటుందో వేచి చూడాలి.