హిమాలయ దేశంలో కొద్ది రోజులుగా జరుగుతున్న విధ్వంసమే ఇది. కోషి ప్రావిన్స్‌లోని సున్సారీ జిల్లాలో రెండు మత వర్గాల వేడుకల సందర్భంగా లౌడ్‌స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగి ఘర్షణలకు దారితీసింది. జులై 26న జరిగిన ఘర్షణలు, పోలీసు కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 26 మంది గాయపడ్డారు. భారత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మధేశ్ ప్రావిన్స్‌లోని సప్తరీ జిల్లా కొన్ని ప్రాంతాల్లో జూలై 31వ తేదీన నేపాల్ అధికారులు నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఈ ఘటన తర్వాత నేపాల్‌లోని పలు జిల్లాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులతోనే బిహార్‌లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు భద్రతను మరింత పెంచారు. బోర్డర్ పోలీస్ స్టేషన్ల వద్ద అదనపు బలగాలను కూడా మోహరించారు. కానీ, నేపాల్‌లో హింస జరుగుతుంటే భారత్ ఎందుకు అలర్ట్ అయింది? ఈ ప్రశ్నకు సమాధానం నేపాల్ నిఘా నివేదికలోనే ఉంది.
సున్సారి ఘర్షణలపై నేపాల్ నిఘా సంస్థ ఆ దేశ హోం మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో విదేశీ మత ప్రచారకుల కార్యకలాపాలు, సరిహద్దు ప్రాంతాల్లోని అనుమానాస్పద నెట్‌వర్క్‌లపై సమగ్ర విచారణ జరపాలని సిఫార్సు చేసింది. ఈ నివేదికలో పాకిస్తాన్ మూలాలున్న మౌలానా మహమ్మద్ ఇలియాస్ ఘుమాన్, ఖాట్మండు మసీదు ఇమామ్ ముఫ్తీ అబు బకర్ కాస్మీలు సున్సరిలో పర్యటించినట్లు ప్రస్తావించారు. ఈ ఇద్దరు మతపెద్దలు భారత సరిహద్దులోని సున్నితమైన జిల్లాల్లో పర్యటించారు. ఆ పర్యటన సమయంలోనే ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఇక్కడే నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో మసీదులు, మదర్సాల కార్యకలాపాలు, విదేశీనిధుల వినియోగంపై తీవ్రప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో భారత్‌లో నమోదైన కొన్ని కేసుల్లో నేపాల్ పౌరులు ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు ఆధారాలు దొరికాయి. 2025లో ఢిల్లీ పోలీసులు ఐఎస్ఐ మాడ్యూల్‌కు సంబంధించి నేపాల్ పౌరుడైన ప్రభాత్ కుమార్ చౌరాసియాను అరెస్ట్ చేశారు. అతని ద్వారా భారత సిమ్ కార్డులను పాక్‌కు పంపినట్లు, అందులోని 16 సిమ్‌లలో 11 పాక్‌లో యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
సున్సారి హింసాత్మక ఘటనల అనంతరం నేపాల్ ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.నిజానికి.. నేపాల్‌లో ఈ ఏడాది మొదట్లో కూడా ఇలాంటి ఘర్షణలే జరిగాయి. ధనుషా జిల్లా కమల మున్సిపాలిటీకి చెందిన హైదర్ అన్సారీ, అమానత్ అన్సారీ అనే వ్యక్తులు సోషల్ మీడియాలో హిందూ దేవతలను కించపరిచేలా ఒక వీడియో పోస్ట్ చేశారు. టిక్ టాక్‌లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఇద్దరు యువకులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో అప్లోడ్ చేశారు. ఈ క్రమంలోనే హిందూ సంఘాలు రోడ్లపైకి వచ్చాయి. ఆ ఇద్దరికీ దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించాయి. అయినప్పటికీ పరిస్థితి సద్దుమణగలేదు.. కొందరు వ్యక్తులు ధనుషా జిల్లాలోని సఖువా మరన్ ప్రాంతంలో ఉన్న మసీదుపై దాడి చేసి, మత గ్రంథాలను కాల్చివేశారు. ఆ తర్వాత మసీదుపై దాడికి నిరసనగా ముస్లిం కమ్యూనిటీ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టింది. ఇవన్నీ భారత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న బీర్గంజ్లోనే జరిగాయి. పర్సా, రాహుల్ వంటి సరిహద్దు ప్రాంతాలు రణరంగంగా మారాయి. అప్పుడు కూడా సరిహద్దు భద్రత కట్టుదిట్టం చేయాల్సి వచ్చింది.
భారత్-నేపాల్ మధ్య 1,751 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. మన దేశ సరిహద్దుల్లో ఎలాంటి కంచె లేని సరిహద్దు ప్రాంతం ఇదే. పైగా ఈ ప్రాంతం భారత వ్యతిరేక శత్రులకు అడ్డాగా మారింది. యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉన్న ఇండో-నేపాల్ సరిహద్దుల్లో కొన్నేళ్లుగా పెరుగుతున్న మసీదులు, మదర్సాలు తీవ్రమైన భద్రతా సమస్యలను కలిగిస్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మతపరమైన సంస్థలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ISI, విదేశాలలో పనిచేస్తున్న భారత వ్యతిరేక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని నిఘా వర్గాలు ఎప్పుడో తెలిపాయి. ఈ మసీదులు, మదర్సాలు.. ISIతోపాటు అరబ్ దేశాల నుండి కూడా నిధులు పొందుతున్నాయి. నేపాల్, భారత్ మధ్య కంచె లేకపోవడంతోపాటు ఎలాంటి అప్పగింత ఒప్పందాలూ లేకపోవడాన్ని భారత వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలచు కుంటున్నాయి. భారత్‌లో విధ్వంసం సృష్టించి నేపాల్ పారిపోవడం చాలా ఈజీ. ఒక్కసారి నేపాల్ వేళితే ఎంతటి ఉగ్రవాది అయినా సేఫ్ జోన్లోకి వెళ్లినట్టే. ఇదే టైంలో కంచె వంటి పటిష్ట భద్రత లేకపోవడంతో భద్రతా బలగాల కళ్లుగప్పి భారత్‌లోకి ఈజీగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. నేపాల్‌లో ఏ చిన్న ఘర్షణ జరిగినా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి అనుకూలంగా మలచుకుంటారు.
నేపాల్‌లో వరుసగా జరుగుతున్న ఘర్షణలను కాస్త లోతుగా గమనిస్తే.. వాంటెడ్‌గానే జరుగుతున్నట్టు అర్ధమవుతుంది. భారత సరిహద్దుల్లోనే జరుగుతున్న అల్లర్ల వెనుక రెండు లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి హిందువులను టార్గెట్ చేస్తూ మోడీ సర్కార్‌పై ఒత్తిడి పెంచడం.. మొదట బంగ్లాదేశ్, తర్వాత నేపాల్లోనూ హిందువులపై దాడులు జరుగుతున్నా మోడీ ప్రభుత్వానికి పట్టింపు లేదు అని విష ప్రచారం చేయడం, రెండోది మతపరమైన ఘర్షణల ముసుగులో ఉగ్రవాదులను మన దేశంలోకి ఎగదోయడం. ఇదే అసలు లక్ష్యం కావచ్చని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది తెలుసు కాబట్టే బిహార్‌లో నేపాల్‌ను ఆనుకుని ఉండే సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.