భారతీయుల సంస్కృతి, సంప్రదాయాల్లో పసిడికి ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకమైనది. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఏదైనా సరే బంగారం కొనుగోలు చేయడం మన ఆనవాయితీ. అయితే 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం 88 రూపాయలు మాత్రమే. కానీ నేడు అదే 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో వేల రూపాయలు దాటి లక్షల వైపు దూసుకెళ్తోంది. దశాబ్దాల కాలంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక మార్పులు, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా బంగారం ధర వేల రెట్లు పెరిగింది. అప్పట్లో రూపాయి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండటంతో ఆనాటి 88 రూపాయలు కూడా సామాన్యుడి నెలవారీ రాబడి దృష్ట్యా పెద్ద మొత్తమే అయినప్పటికీ, ఇప్పటి ధరలతో పోలిస్తే ఇది అత్యంత తక్కువ.
బంగారంతో పాటు నిత్యం కొనుగోలు చేసే వెండి ధరలు కూడా నాటికి నేటికి ఆకాశాన్నంటాయి. 1947 స్వాతంత్ర్య సమయంలో ఒక కిలో వెండి ధర కేవలం 100 నుండి 107 మధ్యలో మాత్రమే ఉండేది. నేడు అదే కిలో వెండి ధర మార్కెట్లో 80,000 పైమాటే. దశాబ్దాలు గడిచే కొద్దీ పారిశ్రామికంగా, ఆభరణాల తయారీలో వెండి వినియోగం పెరగడం, ఆర్థిక మార్పుల వల్ల వెండి ధర కూడా శతాబ్ద కాలంలో వందల రెట్లు ఎగబాకింది. చాలామంది 1947లో ఒక అమెరికన్ డాలర్ విలువ ఒక రూపాయికి సమానంగా ఉండేదని భావిస్తుంటారు. కానీ నిజానికి 1947లో రూపాయి నేరుగా డాలర్‌తో అనుసంధానం కాలేదు. నాటి భారత రూపాయి విలువ బ్రిటీష్ పౌండ్ ప్రాతిపదికన నిర్ణయించబడేది. ఆ సమయంలో 1 డాలర్‌కు రూపాయి మారకం విలువ 3 రూపాయల 30 పైసలు గా ఉండేది.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి దేశ ఆర్థిక పరిస్థితి, దిగుమతులు-ఎగుమతులు, ద్రవ్యోల్బణం మరియు అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ వచ్చింది. నేడు అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ 80 రూపాయలకు పైగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో 5,000 అనేది చాలా భారీ మొత్తం. 1947లో 88 రూపాయల 62 పైసల చొప్పున 10 గ్రాముల బంగారం కొనుగోలు చేసి ఉంటే, ఆ 5,000 మొత్తానికి ఏకంగా 564 గ్రాములకు పైగా బంగారం వచ్చేది. నాటి నుండి నేటి వరకు బంగారం ధర పెరిగిన శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో భద్రపరిచిన 5,000 విలువైన పసిడి నేడు కోట్లాది రూపాయల సంపదగా మారేది.
భారతీయులకు బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు; సంక్షోభ సమయాల్లో ఆదుకునే ఒక 'సురక్షితమైన పెట్టుబడి'. ఆర్ధిక రంగంలో మాంద్యం ఏర్పడినా, యుద్దాలు వచ్చినా, ద్రవ్యోల్బణం పెరిగినా బంగారం తన విలువను కోల్పోకుండా నిలబెట్టుకుంది. 1947లో 88 రూపాయల 62 పైసలుగా ఉన్న తులం బంగారం ప్రయాణం.. నేడు భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు, రూపాయి ప్రయాణానికి ఒక నిలువుటద్దంగా నిలుస్తుంది. ఈ విధంగా చూస్తే, 1947 నాటి మన దేశ ఆర్థిక పరిస్థితులు, నాటి బంగారం-వెండి ధరలు ప్రస్తుత కాలపు రేట్లతో పోల్చి చూసినప్పుడు దేశంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు మరియు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.