Top story: సౌజన్య కేసులో మరో మలుపు.. ఆ కారణంతోనే కుటుంబం ఆత్మహ*త్య..!

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన పిఠాపురం పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటన కేసు రోజుకో సంచలన మలుపు తిరుగుతోంది. సౌజన్య ఆస్తి కోసమే సాజిద్‌ ఆ కుటుంబానికి దగ్గరయ్యాడని పోలీసులు నిర్ధారించారు.

Post Published By: dialnews
Updated : 27 August 2026, 8:00 PM IST

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన పిఠాపురం పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటన కేసు రోజుకో సంచలన మలుపు తిరుగుతోంది. సౌజన్య ఆస్తి కోసమే సాజిద్‌ ఆ కుటుంబానికి దగ్గరయ్యాడని పోలీసులు నిర్ధారించారు. రాజమహేంద్రవరంలోని గోదావరి బ్రిడ్జిపై నుంచి నూకరాజు, ఆయన భార్య మీనా, కూతురు సౌజన్య, మనువడు రియాన్ష్‌ కార్తికేయ రెడ్డి గోదావరిలోకి దూకేశారు. రియాన్ష్‌ మాత్రం ఈత వచ్చి ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన ముగ్గురు చనిపోయారు. మొదట ఇది కుటుంబ ఆత్మహత్యగా భావించినప్పటికీ, లభించిన సూసైడ్ నోట్లు, పోలీసుల లోతైన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడలో ప్రో షూటింగ్ అకాడమీ నడుపుతున్న షేక్ సాధిక్ ఖాన్ 2024 మార్చిలో నూకరాజు మనువడు రియాన్స్‌కు రైఫిల్ షూటింగ్ నేర్పించే నెపంతో ఆ కుటుంబానికి పరిచయమయ్యాడు. సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి పనిమీద బయటకు వెళ్లడం గమనించి తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు.

సౌజన్యతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె భర్త జగదీశ్వరరెడ్డిని అడ్డు తొలగించడం ద్వారా సౌజన్యను పెళ్లి చేసుకుని, ఆ కుటుంబానికి ఉన్న కోట్ల ఆస్తులు, గోదావరిగుంటలోని స్థలాలు, బ్యాంకు ఖాతాలు, బంగారాన్ని కాజేయాలని ప్లాన్ వేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న సాధిక్ సౌజన్య ఇంటికి రాగా, జగదీశ్వరరెడ్డి నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అడ్డువచ్చిన సౌజన్యపై దాడి చేసి, కత్తితో జగదీశ్వరరెడ్డికి తీవ్ర గాయాలు చేశాడు. బయటకు చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత కూడా తిండి పెట్టకుండా హింసించడమే కాకుండా, జగదీశ్వరరెడ్డికి విషపూరితమైన ఇంజెక్షన్లు ఇచ్చాడు.

దీంతో జగదీశ్వరరెడ్డి ఆరోగ్యం క్షీణించి నడవలేని స్థితికి చేరి, ఆగస్టు 2న హైదరాబాద్ ఆసుపత్రిలో చనిపోయాడు. జగదీశ్వరరెడ్డి చనిపోయిన తర్వాత సాధిక్ మరొక యువతిని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేయగా సౌజన్య నిలదీసింది. దీంతో "నా పెళ్ళికి అడ్డుపడితే నీ కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తా" అని, ప్రైవేటు ఫోటోలు, వీడియోలు బయటపెడతానని సాధిక్ బెదిరించాడు. నూకరాజు కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉండాలని బలవంతం చేస్తూ ఆస్తి పత్రాలు, గోల్డ్, SBI లాకర్ వివరాలు లాక్కునే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా, సౌజన్యను ఆమె కొడుకుని ఇస్లాం మతం స్వీకరించాలని, మత గ్రంథాలు చదవాలని తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. సౌజన్య స్కూటీలో దొరికిన సూసైడ్ నోట్లలో సాధిక్ అమానుషాలు బయటపడ్డాయి. "నా కూతురు, మనువడి ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి వణికిపోతున్నాం..

నా కూతురి ఆస్తి దక్కగానే గిఫ్ట్ డీడ్ రాయించుకోవాలని చూస్తున్నాడు" అని మీనా కూడా రాశారు. సౌజన్య తన భర్తను సాధిక్ సైనేడ్ ఇచ్చి హత్య చేశాడని ఆరోపించింది. పోలీసుల విచారణలో సాధిక్ హైదరాబాద్ నుంచి సైనేడ్ తెచ్చి జగదీశ్వరరెడ్డికి ప్రోటీన్ పౌడర్‌లో కలిపి ఇచ్చినట్లు తేలడంతో, ఆ సైనేడ్ అమ్మిన వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు. ఈ దారుణం జరిగిన తర్వాత సాధిక్ పోలీసులకు దొరక్కుండా ఫోన్, డెబిట్ కార్డులు వాడకుండా 5 రాష్ట్రాలు మారాడు. కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలు గాలించి ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో సాధిక్‌ను అరెస్ట్ చేసి కాకినాడకు తీసుకొచ్చారు. ఆస్తి కోసం ఓ కుటుంబాన్ని నాశనం చేసిన ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Published : 
  • 27 August 2026, 8:00 PM IST