రాజకీయాల్లో నిలకడ ముఖ్యం.. ఏ పార్టీలో ఉన్నా సరే.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే.. ఆ పార్టీలో కొనసాగడం అవసరం. ఓ బలమైన రాజకీయ వారసుడిగా కీర్తిస్తున్నప్పుడు ఇది మరింత ముఖ్యం. కానీ ఈ విషయాలను మర్చిపోతున్నారు వంగవీటి రాధాకృష్ణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రభావం చూపే దివంగత నాయకుల్లో వంగవీటి రంగా ఒకరు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధా.. 2004లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత నుంచి పాలిటిక్స్ లో పెద్దగా రాణించలేదు రాధ. దేవినేని కుటుంబంతో ఉన్న విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన అంటి ముట్టనట్లుగానే ఉండేవారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన రాధ ఆ తర్వాత.. 2014లో వైసీపీకి జై కొట్టారు. 2019లో టిడిపికి జై కొట్టారు. అప్పటినుంచి టిడిపిలోనే కొనసాగుతున్నారు రాధా. ముందు ఆయనకు నరసాపురం ఎంపీ సీట్ ఇస్తారని ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లో ఆయన నరసరావుపేట పార్లమెంట్లో ఓ కీలక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ కూడా హడావుడి జరిగింది. ఏం జరిగిందో ఏమో టిడిపి నాయకత్వం ఆయనను పక్కన పెట్టింది. అయితే ప్రచారం విషయంలో మాత్రం వంగవీటి రాధా కీలకంగా వ్యవహరించారు అప్పట్లో. కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో ఆయన చేసిన ప్రచారం కూటమికి కలిసి వచ్చింది.
అయితే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో వంగవీటి రాధాకు.. కీలక పదవి అప్పగించే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. కాపు సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన చంద్రబాబు నాయుడు.. ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు వంగవీటి రాధా ఎమ్మెల్సీగా లేదంటే మరో పదవిలో కూర్చోలేదు. ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఆయనను మంత్రిని కూడా చేస్తారంటూ హడావుడి జరిగింది. జనసేన నుంచి నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోవడం వెనుక ప్రధాన కారణం వంగవీటి రాధా అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే మూడున్నర ఏళ్ల పదవీకాలం ఉన్న ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడాన్ని వంగవీటి రాధా తప్పు పట్టారని అప్పట్లో ప్రచారం జరిగింది.
అయితే ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తారంటూ ఈమధ్య మళ్లీ ప్రచారం మొదలైంది. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటికి వంగవీటి రాధను ఎంపిక చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవుల్లో ఏదో ఒకటి ఆయనకు ఇచ్చే ఆలోచనలోనే కూటమి ప్రభుత్వం కూడా కనబడింది. మంత్రి నారా లోకేష్ వంగవీటి రాధ విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. ఆయనకు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కూడా ఇంటికి వెళ్లి పరామర్శించారు లోకేష్. అలాంటిది ఇప్పుడు వంగవీటి రాధా.. ఓ షాకింగ్ ప్రకటన చేశారు. గోదావరి జిల్లాలో వంగవీటి రంగ విగ్రహావిష్కరణకు వెళ్లిన రాధ.. అక్కడ వైసిపి నేతలతో కలిసి పాల్గొన్నారు.
దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్ లతో కలిసి విగ్రహావిష్కరణ చేసిన రాధ.. వాళ్ళిద్దరికీ మీ ఆశీస్సులు ఉండాలంటూ వంగవీటి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై కూటమిలో చర్చ మొదలైంది. జగన్ కు మళ్ళీ వంగవీటి రాధ జై కొట్టే అవకాశం ఉందంటూ హడావుడి మొదలైంది. దీని వెనక మరో కారణం కూడా ఉంది.. ఆయన మిత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు వైసీపీలోనే ఉన్నారు. 2019లో ఆయన జగన్మోహన్ రెడ్డిని విభేదించిన సమయంలో.. ఇబ్బందులు రాకుండా కాపాడింది ఆ ఇద్దరే అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేందుకు ఆ ఇద్దరూ మార్గం కూడా సుగమం చేశారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసే ఛాన్స్ కూడా కనపడుతుంది.
ఇప్పుడు దీనిపైనే కాపు సామాజిక వర్గంలో కూడా చర్చ మొదలైంది. పదే పదే పార్టీలు మారితే.. రంగ వారసత్వానికి విలువ ఉండదు అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన సోదరి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమెను మేయర్ ను చేసే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆమె దాదాపుగా తెలుగుదేశం పార్టీలో లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే సంకేతాలు రావడం వంగవీటి కుటుంబంలో చీలికకు కారణమయ్యే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే రంగా రాదా మిత్రమండలిని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్న ఆయన సోదరి.. రాధ చర్యలతో కాస్త ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుందని, వంగవీటి కుటుంభ వర్గాలు అంటున్నాయి. పదవులు వచ్చే సమయంలో రాధ దూరమైతే.. ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా దెబ్బ పడుతుందంటూ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలో కూడా వంగవీటి రాధకు మద్దతు ఉంది. కాబట్టి కాస్త ఓపికగా ఎదురు చూస్తే ఆయనకు పదవి రావడం ఖాయం. ఇటువంటి సమయంలో అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఆయన పొలిటికల్ ఫ్యూచర్ కు ఇబ్బందులు తప్పవు.