Top story: బంగారం కొనుగోళ్లు ఢమాల్.. అయినా ఆగని పుత్తడి పరుగు..!

ప్రధాని మోడీ ఒకటి తలిస్తే...దైవం మరోకటి తలిచింది. అధికారికంగా బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అయితే పుత్తడి స్మగ్లింగ్‌ మాత్రం...ఊహించని విధంగా పెరిగింది. బిల్లులు లేకుండా కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది.

Post Published By: dialnews
Updated : 3 August 2026, 9:30 PM IST

ప్రధాని మోడీ ఒకటి తలిస్తే...దైవం మరోకటి తలిచింది. అధికారికంగా బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అయితే పుత్తడి స్మగ్లింగ్‌ మాత్రం...ఊహించని విధంగా పెరిగింది. బిల్లులు లేకుండా కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. ఫారెక్స్‌ నిల్వలు పెంచుకోవడానికి పుత్తడి కొనుగోలు చేయవద్దని ప్రధాని మోడీ...దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుకున్నట్లే మోడీ మంత్రం పని చేసింది. గతేడాది కంటే పసిడి డిమాండ్‌ ఏకంగా 9 టన్నులు తగ్గింది.బంగారం ధరలు కొంతకాలంగా తగ్గుముఖం పట్టాయి. లక్షా 80 వేలు క్రాస్‌ చేసిన పది గ్రాముల గోల్డ్...ప్రస్తుతం లక్షా 502లోపునుకు దిగి వచ్చింది. పశ్చిమాసియా యుద్ధం, ప్రధాని మోడీ పిలుపుతో...దేశంలో బంగారం డిమాండ్‌ ఊహించని విధంగా పడిపోయింది. భారతీయులు పండుగలు, పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలకు ప్రజలు గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉంటారు. అయితే మోడీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో దేశ ప్రజలు పుత్తడికి దూరమయ్యారు.

పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగినా...బంగారాన్ని మాత్రం కొనుగోలు చేయలేదు. దీంతో బంగారం డిమాండ్‌ గతేడాది కంటే ఆరు శాతం పడిపోయింది. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొనుగోళ్ల పరిమాణం కొంత తగ్గింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 131 టన్నులుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 139.1 టన్నులు పుత్తడి అమ్మకాలు జరిగాయి. 2025తో పోలిస్తే ఈ ఏడాది 6 శాతం తక్కువే, కానీ ధరలు మాత్రమే గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో పెరిగింది. దీని వల్ల కొనుగోళ్లపై ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది. 2026 ఏప్రిల్-జూన్ కాలంలో భారతీయులు బంగారం కొనుగోలు కోసం 1.98 లక్షల కోట్లను ఖర్చు చేశారు. 2026లో భారత్‌లో పుత్తడి డిమాండ్‌ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉంటుందని డబ్ల్యూసీజీ అంచనా వేసింది. ఇది 2025తో పోలిస్తే 50 శాతం ఎక్కువ. అంటే ప్రజలు తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినప్పటికీ, పెరిగిన ధరల కారణంగా ఖర్చు చేసిన మొత్తం పెరిగిందన్నమాట. 2025 రెండో త్రైమాసికంలో వినియోగం విలువ రూ. 1,32,500 కోట్లుగా ఉండగా ఈసారి రూ. 1,98,100 కోట్లకు చేరింది. గతేడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 50 శాతం పెరిగింది.

ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే ఎక్స్చేంజ్ పద్ధతులు, ఈఎంఐ సౌకర్యాలు, తక్కువ బడ్జెట్‌లో విలువైన ఆభరణాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం డిమాండ్ అనేది ధరలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కారణంగా రెండో అర్ధభాగంలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ధరలు ఇలాగే అధికంగా కొనసాగితే ఆభరణాల కొనుగోళ్లపై కొంత ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు.

దిగుమతి సుంకాల పెంపు, ప్రధాని పిలుపుతో బంగారానికి డిమాండ్‌ తగ్గినప్పటికీ.. ఇది గ్రే మార్కెట్ నిర్వహణను, స్మగ్లింగ్‌ను ప్రోత్సహించే అవకాశం ఉంది. మరోవైపు బార్‌, కాయిన్‌ డిమాండ్‌ 9 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ డిమాండ్‌ 50.3 టన్నులకు చేరింది. భారత గోల్డ్‌ ఈటీఎఫ్‌లు 4.2 టన్నులకు చేరాయి. మొత్తం బంగారం రీసైక్లింగ్‌ జూన్‌ త్రైమాసికంలో 17 శాతం తగ్గి 19.2 టన్నులుగా ఉంది. రెండో త్రైమాసికంలో నికర బంగారం దిగుమతులు 23 శాతం తగ్గి 98.1 టన్నులకు పడిపోయాయి. ప్రస్తుత ట్రెండ్స్‌ చూస్తే బంగారానికి సంప్రదాయ కోణంలోనే కాకుండా ఆర్థిక అనిశ్చితిలో అక్కరకొచ్చే వ్యూహాత్మక పెట్టుబడి సాధనం కూడా అనే కోణంలోనూ డిమాండ్‌ ఏర్పడుతోందని తెలుస్తోంది. ద్వితీయార్థంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌తో మరింత డిమాండ్‌ పెరగొచ్చు.

పసిడిపై దిగుమతి సుంకాలు పెంచడంతో గోల్డ్‌ స్మగ్లర్లు పండుగ చేసుకుంటున్నారు. దొడ్డి దారిలో విదేశాల నుంచి పుత్తడిని అక్రమ మార్గాల్లో ఇండియాకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు దాదాపు 18 శాతం లాభం ఉండడంతో...ఇండియా టు ఫారెన్‌, ఫారెన్‌ టు ఇండియాకు చక్కర్లు కొడుతున్నారు. అధికారుల కళ్లు గప్పి దుబాయ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి బంగారాన్ని భారత్‌కు తరలిస్తున్నారు. ఈ ఏడాది మే 13 నుంచి జూన్‌ నెలాఖరు వరకు స్మగ్లర్ల నుంచి రికార్డు స్థాయిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రెండు నెలల్లోనే స్మగ్లర్ల నుంచి 160.91 కేజీల బంగారం పట్టుకున్నారు. గత ఏడాది ఇదే సమయంలో స్వాధీనం చేసుకున్న బంగారం 86.16 కిలోలు మాత్రమే. పసిడి మార్కెట్‌పై స్మగ్లిం తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

Published : 
  • 3 August 2026, 9:30 PM IST