Top story: బంగారు, వెండి పరుగుల్లో… కొంటారా? అమ్ముతారా? ఏది మంచింది..?
కొన్నిరోజులుగా పసిడి పట్టుకోండి చూద్దాం అన్నట్టు పరుగులు తీసింది. రికార్డులు మీద రికార్డులు బ్రేక్ చేసింది. చూస్తుండగారు లక్షన్నర దాటిపోయింది.
కొన్నిరోజులుగా పసిడి పట్టుకోండి చూద్దాం అన్నట్టు పరుగులు తీసింది. రికార్డులు మీద రికార్డులు బ్రేక్ చేసింది. చూస్తుండగారు లక్షన్నర దాటిపోయింది. మధ్య మధ్యలో మూడు నాలుగుసార్లు తగ్గినా..ఓవరాల్‌గా పెరుగుతూనే పోయింది. పెరిగింది వేలల్లో అయితే..తగ్గింది వందల్లోనే. పెరగడమే తప్ప ఇక తగ్గడం కష్టమే. డబ్బులు వుంటే ఇప్పుడే కొనేయాలి. లేదంటే భవిష్యత్‌లో కొనలేం..ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపించింది. డౌన్ ఫాల్ ఇలాగే కొనసాగుతుందా ? లేదంటే మళ్లీ ఎప్పటిలాగే ఆల్‌టైమ్ రికార్డులు బ్రేక్ చేస్తుందా అనేది ఉత్కంఠరేపుతోంది.
బంగారం తులం లక్షకు చేరితేనే బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకున్నారు. అలాంటిది నెలల వ్యవధిలో ఏకంగా రూ.1.60 లక్షలు దాటేసింది. ఇక వెండి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాదిన్నర కిందటి వరకూ కిలో లక్ష రూపాయలలోపే. లక్ష దాటడమే గగనం అనుకున్నారంతా. కానీ ఇప్పుడు 3.60లక్షలకు చేరింది. నిజానికి ఊహలకు కూడా అందని పరుగులివి.
2025 జనవరి నుంచి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 79 శాతం పెరిగింది. ఔన్స్‌కు 2,780 డాలర్ల నుంచి 4,965 డాలర్లకు చేరగా, వెండి ఔన్స్ 30 డాలర్ల నుంచి 100 డాలర్ల స్థాయిని తాకింది. ఈ కాలంలో వెండి ఏకంగా 223 శాతం ర్యాలీ చేసింది. రూపాయి ఇటీవలి కాలంలో డాలర్‌తో విలువను కోల్పోతూ వస్తోంది. బంగారం, వెండిని డాలర్ రూపంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా దేశీయంగా వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్ కంటే పెరిగేలా చేస్తోంది. బంగారం, వెండి గణనీయంగా ర్యాలీ చేస్తుండడంతో.. ఇన్వెస్టర్లు వాటివైపు ఆకర్షితం అవుతుండడం ధరలను మరింత పెరిగేలా చేస్తోంది.
సెంట్రల్ బ్యాంక్‌లు సైతం కొండంత నమ్మకంతో పసిడిని కొనుగోలు చేస్తుండటం… వ్యక్తిగత వినియోగ అవసరాలకుతోడు రిటైల్ ఇన్వెస్టర్లు, సంపన్నులు సైతం బంగారంవైపు చూస్తుండటం పసిడిని పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ విలువైన లోహాల ధరలు గడిచిన మూడేళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలను నమోదు చేస్తుండడంతో రాబడుల కాంక్షతో కొందరు దూకుడుగా పెట్టుబడులు పెడుతున్నారు. మరిప్పుడు ఏం చేయాలి ? కొత్తగా కొనాలనుకున్న వారి పరిస్థితేంటి ? ఇళ్లలో కిలోలకు కిలోలు వెండి ఉన్నవారు మంచి రేటు వచ్చింది కనక దాన్ని విక్రయిస్తే మంచిదా ? ఒకవేళ బంగారం, వెండి వంటి మెటల్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ? ఈటీఎఫ్‌లవైపు చూడొచ్చా ? అన్న చర్చ జరుగుతోంది. అయితే సిప్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెడితేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పెట్టుబడుల్లో వైవిధ్యానికి.. పోర్ట్‌ఫోలియో హెడ్జింగ్ కోసం చూసే వారు దీర్ఘకాలం కోసం బంగారంలో సిప్ రూపంలోఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గరిష్ట ధరల వద్ద ఒకేసారి పెట్టుబడి పెట్టడం కాకుండా నెలవారీ నిర్ణీత మొత్తాన్ని గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నింటిలోకి మెరుగైన మార్గం. తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారం, వెండికి కేటాయింపులు 10–20 శాతానికి పరిమితం చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఒక విభాగంలో అధిక ఎక్స్‌పోజర్‌ను నివారించొచ్చు. అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీలతోపాటు, పెట్టుబడులకు రక్షణనిచ్చే డెట్ సాధనాలు, బంగారం, వెండి మధ్య తగినంత సమతుల్యం ఉండేలా చూసుకోవచ్చు.
బంగారం, వెండి ధరల పరుగును చూసి హడావిడిగా పెట్టుబడులు పెట్టేయాల్సిన పనిలేదు. ఉన్నట్టుండి వీటి ధరలు గణనీయంగా పెరగడమే కాదు.. వీటిల్లో దిద్దుబాటూ అదే విధంగా ఉండొచ్చు. స్వల్పకాలంలో వీటి డిమాండ్, ధరల తీరును కచ్చితంగా అంచనా వేయడం కష్టం. దీర్ఘకాలంలో మాత్రం బంగారం, వెండి మూలాలు పటిష్టమే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇప్పటికే బంగారం కొనుగోలు చేసిన వారు గరిష్ట ధరల వద్ద విక్రయించి లాభం స్వీకరించాలనుకుంటే…లేదా లిక్విడిటీ పెంచుకోవాలంటే…చేతిలో ఉన్న బంగారాన్ని విక్రయించుకోవచ్చు.
చేతిలో ఉన్న బంగారం అమ్ముదలచుకునేవారు…జీఎస్‌టీ చార్జీలు, తరుగు రూపంలో లాభంలో కొంత నష్టపోవాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. అనుకున్న లక్ష్యానికి బంగారం ధరలు చేరినట్టయితే పాక్షికంగా విక్రయించడం మంచి ఆలోచనేనని నిపుణులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో భయపడాల్సిన అవసరం లేదని…మరింత పెరిగితే కొనలేమోమోనన్న భయం అవసరం లేదని అంటున్నారు. అధిక ధరల వద్ద కొనుగోలు చేసినప్పుడు స్వల్పకాలంలో కరెక్షన్ల రిస్క్ కూడా ఉంటుంది. వెండి భౌతిక రూపంలో కొనుగోలు చేస్తే, తర్వాత నగదుగా మార్చుకోవడం కష్టం కావొచ్చు. డిజిటల్ రూపంలో అయితే బంగారం, సిల్వర్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉన్నాయి.










