బంగారం ధరలు దిగొస్తాయా ? పది గ్రాముల పుత్తడి...లక్ష రూపాయల లోపునకు పడిపోతుందా ? ఇది జరగాలంటే...రష్యాతోనే సాధ్యమవుతుందా ? మాస్కోకు...బంగారం ధరలకు ఉన్న లింకేంటి ? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్...ఆ నిర్ణయం తీసుకుంటే పుత్తడి ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయా ? అసలేంటీ లాజిక్ అనుకుంటున్నారా ?బంగారం ధరలు తగ్గాలని ప్రతి మహిళ కోరుకుంటున్నారు. లక్షన్నర దాటిన ధరలు లక్షలోపునకు పడిపోవాలని ఎదురుచూస్తున్నారు. నిజంగా మహిళలు ఆశించినట్లు జరుగుతుందా అంటే...సాధ్యమే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ప్రస్తుతం తులం మేలిమి బంగారం ధర లక్షన్నర పైగా పలుకుతోంది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు పుత్తడి ధర 5,000 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఔన్సు పసిడి ధరలు 3,000 డాలర్లకు దిగిరావచ్చని అంచనా వేస్తున్నారు. ఔన్సు బంగారం ధరలు పతనమైతే...ఆటోమేటిక్ తులం కనకం ధర..లక్ష లోపునకు దిగివస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ధరలు ఊహించని విధంగా పతనం కావాలంటే...అది రష్యాతోనే సాధ్యవుతుంది. అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం తీసుకుంటే...భారతీయ మహిళలు పండగ చేసుకోవచ్చు. అదేలా అంటే...రష్యా కనుక అమెరికా డాలర్లలో వాణిజ్యాన్ని పునఃప్రారంభిస్తే ధరలు ఘోరంగా పడిపోనున్నాయి. రష్యా చమురు కొనకుండా, భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ భారీ సుంకాలు విధించారు. దీంతో రష్యా దారిలోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు, అమెరికా డాలర్లలో వాణిజ్యం నిర్వహించేందుకు రష్యా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీలు తేవాలన్న బ్రిక్స్ దేశాల సన్నాహాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే. రష్యా కనుక అంతర్జాతీయ వాణిజ్య సెటిల్‌మెంట్లను డాలర్లలో నిర్వహిస్తే, అమెరికా కరెన్సీ పరుగులు పెడుతుంది. పసిడిపై పెట్టుబడులు మళ్లీ డాలర్‌కు చేరతాయి. అప్పుడు కేంద్రబ్యాంకులూ బంగారం కొనడం ఆపేస్తాయి.
2025లో పసిడి, వెండి ధరలు పరుగులు పెట్టాయి. ఏడాది వ్యవధిలోనే బంగారం ధర 70 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1.80 లక్షలకు చేరింది. ఆ తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 1.59 లక్షలు పలుకుతోంది. అంతర్జాతీయంగానూ ఔన్సు బంగారం ధర 5600 డాలర్లపైకి వెళ్లినా, మళ్లీ ఇప్పుడు 5000 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించాక, అంతర్జాతీయ అనిశ్చితులు నెలకొన్నాయి. దీంతో బంగారంపైకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ కారణంగా పుత్తడి ధరలు అనుకోనివిధంగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చేకూర్చాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు దేశాల అధ్యక్షులతో విడివిడిగా సంప్రదింపులు జరిపారు. వచ్చే జూన్ కల్లా యుద్ధాన్ని నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు.
అంతర్జాతీయ పసిడి నిల్వల్లో 20% బ్రిక్స్ దేశాల వద్దే ఉన్నాయి. బ్రిక్స్ దేశాలతో అనుబంధం ఉన్న దేశాల నుంచే, అంతర్జాతీయ పసిడి ఉత్పత్తిలో 50% వాటా ఉంది. ఇప్పుడీ దేశాలన్నీ బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నా, అతి తక్కువగా విక్రయిస్తున్నాయి. ఈ కారణంగా ధరలు ఊహించని విధంగా పెరిగాయి. ఇప్పుడు మళ్లీ డాలర్‌కు మద్దతు పెరిగితే, అమెరికా బాండ్లకు గిరాకీ వస్తుంది. దీంతో బంగారంపై పెట్టుబడులు ఉపసంహరించడం ప్రారంభిస్తే ఔన్సు ధర 2027 ఆఖరుకు 3,000 డాలర్లకు దిగిరావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర 90వేల నుంచి లక్షలోపు ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.